
గ్రామ విజన్ మ్యాప్‌లు సిద్ధం చేయండి
సాక్షి,పాడేరు: కేంద్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి దేశవ్యాప్తంగా ఆమలుజేస్తున్న ఆదికర్మయోగి గ్రామ విజన్‌కు మ్యాప్‌లు సిద్దం చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్‌లో ఆదికర్మయోగి కార్యక్రమం అమలుపై పలుశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 20 లక్షల మంది గిరిజన యువతకు ఆదికర్మయోగి సేవాదాతలుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 దృష్టితో గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామస్థాయిలో నాయకత్వం, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. వచ్చేనెల 4వతేదీ నుంచి ఆదికర్మయోగి కార్యక్రమం అమలుపై గ్రామ, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, అటవీ ఉత్పత్తుల వ్యాపారం తదితర ఆంశాలపై అభివృద్ధి లక్ష్యంతో శిక్షణ ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదికర్మయోగి కార్యక్రమం అమలుకు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తారని ఆయన తెలిపారు. అనంతరం ఆదికర్మయోగి కార్యక్రమంపై కలెక్టర్,జేసీ అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.పద్మలత, జిల్లా మాస్టర్ ట్రైనర్లు వి.నాగశిరీష, డి.శారదాదేవి, అచ్యుత్‌కిరణ్, రామం, చంద్రకిరణ్, ధ్రువకుమార్, బాబు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అన్నిశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది మాదిరిగానే తలారిసింగి బాలుర ఆశ్రమ పాఠశాల మైదానంలో వేడుకలు నిర్వహించాలన్నారు. స్వాతంత్య్ర సమరయోథుల కుటుంబాలను ఆహ్వానించి ఘనంగా సత్కరించాలన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలోని మూడు ఐటీడీఏల నుంచి మూడు స్టాళ్లు ఏర్పాటుచేయాలని సూచించారు. అన్నిశాఖలు అభివృద్ధిపై శకటాల ప్రదర్శన ఏర్పాటుచేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ట్రాన్స్‌కో అధికారులు,సురక్షిత తాగునీటికి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్‌గౌడ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
జిల్లా అధికారులతో సమావేశం