
తమ్ముడి చేతిలో అన్న హతం
చీడికాడ: మద్యం మత్తులో చిన్న విషయం కాస్తా పెద్దపై సొంత అన్నయ్య ప్రాణం తీసే వరకు వెళ్లింది. ఈ దుర్ఘటన మండలంలోని తురువోలులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన జోగా రాము (48), జోగా దేముళ్లు సొంత అన్నదమ్ములు. మంగళవారం సాయంత్రం గ్రామంలో ఒడ్డు పండగ చేసుకొని కళ్లానికి వెళ్లారు. తల్లి వద్ద పాలు తాగేస్తుందని మద్యం మత్తులో ఉన్న దేముళ్లు దూడపెయ్యిని కర్రతో కొట్టాడు. దీనిని మృతుడు రాము వారించాడు. దీంతో ఇరువురి మధ్య స్వల్ప తగాదా జరిగింది. తీవ్రమైన కోపంతో దేముళ్లు పాకలో ఉన్న నాటు తుపాకీ తెచ్చి అన్నపై కాల్పులు జరపగా రాము ఛాతి కింద గాయమైంది. కుటుంబ సభ్యులు ఆటోలో చోడవరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రాము మృతి చెందాడు. ఈ సమాచారం పోలీసుల వరకు చేరడంతో కె.కోటపాడు సీఐ పైడిపునాయుడు, మాడుగుల ఎస్‌ఐ నారాయణరావులు మంగళవారం రాత్రి గ్రామానికి వెళ్లి విచారించారు. అయితే రాము మృతికి కాల్పులు కారణం కాదని కుటుంబ సభ్యులు చెబుతూ ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు చెప్పారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వివరాలు తెలియజేస్తామని ఆయన చెప్పారు.
మద్యం మత్తులో స్వల్ప వివాదం
నాటుతుపాకీతో కాల్పులు