వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి
● ఆవేదన కలిగించేలా ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలు ● కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగింది : సంఘం నేతలు
డుంబ్రిగుడ: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లుగా పనిచేసిన తమను విధుల నుంచి తొలగించడం అన్యాయమని డుంబ్రిగుడ, అరకులోయ వలంటీర్ల సంఘం నేతలు దివ్యభారతి, ఎస్. కృష్ణవేణి, బి.విజయ్‌కుమార్, సరస్వతి, ఉదయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు కురిడిలో మంగళవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను కోరారు. అయితే వలంటీర్ల నియామకానికి సంబంధించి ఎలాంటి జీవోలు లేవని, ఇచ్చేది జీతం కాదు, గౌరవ వేతనం మాత్రమేనని పవన్‌కల్యాణ్ చెప్పారని వారు వాపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తమను తొలగించడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, తమను ఆదుకోవాలని వారు కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రకారం రూ. పదివేల వేతనం చెల్లించి, తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి నేతలు విస్మరించడం సరికాదన్నారు. ఇప్పటికై న రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు.


