పాడేరులోయువకుడి ఆత్మహత్య
పాడేరు: పాడేరు పట్టణంలో ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణానికి చెందిన కెల్లా మణికంఠ(27) బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం పట్టణంలోని చాకలిపేట వీధిలోని తన ఇంట్లో గదిలో ఫ్యాన్‌కు ఆయన ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు అతడిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. మృతుడి పక్కనే ఫోన్ పగిలిపోయి ఉంది. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
ఫైనల్ సెటిల్‌మెంట్ కోసం వీఆర్‌ఎస్ ఉద్యోగుల నిరీక్షణ
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ(విఆర్‌ఎస్) పొందిన ఉద్యోగులు ఫైనల్ సెటిల్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. వీఆర్‌ఎస్ ప్యాకేజీ పదవీ విరమణ రోజే అందుకున్న ఉద్యోగులకు, మిగతా వాటి కోసం ఎదురు చూపులు తప్పట్లేదు. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ప్రకటించిన వీఆర్‌ఎస్‌కు స్పందించి 1,126 మంది మార్చి నెలాఖరున పదవీ విరమణ చేయగా, 60 ఏళ్లు నిండిన 89 మంది రెగ్యులర్ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. యాజమాన్యం సర్క్యులర్‌లో చెప్పిన మాట ప్రకారం వీఆర్‌ఎస్ ప్యాకేజీను చివరి రోజు రాత్రి వారి అకౌంట్లకు పంపేశారు. అదే మాదిరి ప్రతీ నెలా రెగ్యులర్ రిటైర్‌మెంట్ పొందే ఉద్యోగులకు ఇచ్చేలా గ్రాట్యుటీ 7వ తేదీలోగా, పీఎఫ్ 20వ తేదీ నాటికి అందుతుందని భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే గ్రాట్యుటీ కోసం ఎదురు చూడక తప్పదని తెలుస్తోంది. పీఎఫ్ అయితే మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. యాజమాన్యం పీఎఫ్ ట్రస్ట్‌కు ఇటీవల ఇచ్చిన రూ.380 కోట్లు ఉద్యోగుల హయ్యర్ పెన్షన్‌కు మాత్రమే సరిపోయేలా ఉంది. దీంతో వీఆర్‌ఎస్ ఉద్యోగులకు పీఎఫ్ చెల్లింపుల ఇప్పట్లో జరిగేలా కనిపించట్లేదు. ఇక లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కోసం మరింత ఎదురు చూపులు తప్పేలా లేవని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యం స్పందించి ఇంతకు ముందు రెగ్యులర్ రిటైర్‌మెంట్ల వలే వీఆర్‌ఎస్ ఉద్యోగులకు సత్వరంగా సెటిల్‌మెంట్ చేయాలని కోరుతున్నారు.


