కై లాస్‌నగర్: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. సాగు పనులు ఆశించినస్థాయిలో జరగడం లేదు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వీబీజీ రాంజీ (ఉపాధి హామీ) పనులకు ప్రాధాన్యత ఏర్పడింది. గడిచిన రెండున్నర నెలల్లోనే జిల్లావ్యాప్తంగా 2.99 లక్షల పనిదినాలు పూర్తికావడం గమనార్హం. ఇందులో కూలీలకు ఇప్పటి వరకు రూ.9,01,97,120 లను చెల్లింపులు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జూలై నుంచే ఉపాధి హామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. భవిష్యత్తులో నీటి కరువు పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో అధికారులు జలసంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ఏడాది పూర్తయ్యే పనిదినాల ఆధారంగానే భవిష్యత్తులో నిధులు కేటాయించే అవకాశముంది.
2.99లక్షల పనిదినాలు పూర్తి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా కొనసాగిన పథకం పేరును వీబీజీ రాంజీగా మార్చిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై 1నుంచి అమల్లోకి తెచ్చింది. గతంలో మాదిరి కాకుండా కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులను ఈ పథకానికి కేటాయించేలా మార్పులు చేసింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలు, రైతులకు ఈ పథకం వరంలా మారింది. జిల్లా వ్యాప్తంగా ఈ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జూలై 1 నుంచి ఈ నెల 19 వరకు 2,99,464 పనిదినాలు పూర్తి కావడం చూస్తే పనులకు ఏర్పడిన డిమాండ్ అర్థమవుతోంది. అత్యధికంగా ఉట్నూర్ మండలంలో 31,513 పనిదినాలు కల్పించగా అత్యల్పంగా మావలలో 4,542 పనిదినాలు కల్పించారు.
జల సంరక్షణపై ఫోకస్
జిల్లాలో వర్షాధారంగానే వ్యవసాయ పనులు సాగుతుంటాయి. అయితే ఎల్‌నినో కారణంగా ఈ సారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో గ్రామాల్లో సాగు పనులు మందగించాయి. ఈ క్రమంలో కూలీలతో పాటు, రైతులు సైతం ఉపాధి పనులపై మక్కువ చూపుతున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 50 మంది కూలీలకు పనులు కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈమేరకు వారంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు జల సంరక్షణ చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫాంపౌండ్‌లు, ఇంకుడుగుంతలు, మొక్కలు నాటడం వంటి పనులు చేపడుతున్నారు. దీంతో కూలీలకు ఉపాధితో పాటు భూగర్భజలాల పెంపునకు దోహదపడుతుంది. వీటితో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు 90 రోజుల పనిదినాలు కల్పించేటట్లుగా బిల్లులను చెల్లిస్తున్నారు.
ప్రతి కూలీకి పని
కల్పించేలా చర్యలు
ఎల్‌నినో ప్రభావంతో వీబీజీ రాంజీ పనులకు వచ్చే కూలీల సంఖ్య పెరుగుతుంది. అందరికీ పని కల్పించడంపై శ్రద్ధ వహిస్తున్నాం. ఒక్కో గ్రామంలో కనీసం 50 మంది పనిచేసేలా లక్ష్యాన్ని నిర్దేశించాం. కొత్తగా జాబ్‌కార్డులు పొందాలనుకునేవారు, ఇతరత్రా సమస్యలుంటే ఎంపీడీవోలను సంప్రదించి పరిష్కరించుకోవచ్చు. భూగర్భజలాల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పనులు చేపడుతున్నాం.
– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో
వీవీజీ రాంజీ ద్వారా కూలీలకు కల్పించిన
పనులు, చెల్లించిన నిధుల వివరాలు
నెల కల్పించిన చెల్లించిన సరాసరి
పనిదినాలు నిధులు కూలి
జూలై 1,77,184 రూ.5.38 కోట్లు రూ.304
ఆగస్టు 93,713 రూ.2.80 కోట్లు రూ.299
సెప్టెంబర్ 28,567 రూ.83.12కోట్లు రూ.291


