ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికల సందడి
పోరుకు సై అంటున్న సంఘాలు
డిపోల్లో మొదలైన ఆకర్ష్ మంత్రం
ఈనెల 25వరకు పొత్తులపై స్పష్టత
సాక్షి, ఆదిలాబాద్: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ మే రకు ఆయా డిపోల్లో యూనియన్ల సందడి మొదలైంది. పోరుకు సై అంటూ కార్మికులను ఆకర్షించే ప్రయత్నాలు షురూ చేశాయి. ఆర్టీసీలో 11 సంఘాలు ఉండగా రీజియన్‌లో మూడు, నాలుగు సంఘాల ప్రాబల్యమే అధికంగా ఉంది. ఈ నెల 25వరకు పొత్తులపై స్పష్టత వస్తుందని యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొంది స్టీరింగ్ పట్టేదెవరనే దానిపై కార్మికుల్లో ఆతృత నెలకొంది.
రీజియన్ పరిధిలో..
ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఆదిలాబాద్, ఉ ట్నూర్, ఆసిఫాబాద్, నిర్మల్, భైంసా, మంచిర్యాల డిపోలు ఉన్నాయి. ఉద్యోగులు, కార్మికులు కలిపి 1870 మంది ఉన్నారు. 2016లో చివరి సారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. అప్పుడు అటు రా ష్ట్రస్థాయి, ఇటు రీజియన్ స్థాయిలోనూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ గుర్తింపు పొందడం జరిగింది. ఇటీవల టీఎంయూలో చీలిక నేపథ్యంలో ఈ యూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఐఎన్‌టీయుసీ అనుబంధ ఎస్‌డబ్ల్యూయూతో పాటు ఇతర సంఘాలు ఆ యూనియన్ వారిని ఆకర్షించడంపై దృష్టి సారించాయి.
ప్రధాన అంశాలు..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది సంఘాల ప్రధాన డిమాండ్. దీంతో పాటు వేతన బకాయిలు, డీఏ చెల్లింపులు, డిపోల్లో పనివేళలు, రన్నింగ్ టైం, కార్మిక భద్రత సమస్యలనే ఎజెండాగా చేసుకుని ఓటర్లను ఆకట్టుకునేందుకు యూనియన్లు ఇప్పటికే రంగంలోకి దిగాయి. రాష్ట్ర, రీజియన్ స్థాయిలో ఆయా సంఘాలు తమకు ఉపయుక్తంగా ఉండేలా పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ దిశగా అన్ని రీజియన్లు, డిపోల్లో ఆయా విస్తృతంగా మంతనాలు చేస్తు ఎక్కడ, ఎలా, ఎవరితో కలిసి వెళ్లాలనే విషయంలో ప్రణాళికలు చేస్తున్నారు.
రెండు ఓట్లు..
ఆర్టీసీ ఎన్నికల్లో రాష్ట్ర గుర్తింపు సంఘం, రీజియన్ గుర్తింపు వేర్వేరుగానే ఉంటాయి. ఈ రెండు స్థాయిల ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఒకేసారి రెండు వేర్వేరు బ్యాలెట్ పత్రాలను అందిస్తారు. రాష్ట్ర గుర్తింపు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన ఒకే ఒక కార్మిక సంఘానికి గుర్తింపు హోదా ఇస్తారు. రీజియన్ గుర్తింపులో వైవిధ్యముంది. రీజియన్ పరిధిలోని మొత్తం ఓట్లలో సగం కంటే ఒక్క ఓటు అధికంగా సాధించిన పక్షంలోనే ఆ సంఘానికి రీజియన్ గుర్తింపునివ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏ సంఘానికి ఆ స్థాయిలో ఓట్లురాని పక్షంలో రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన సంఘమే రీజియన్‌లోనూ గుర్తింపు కలిగి ఉంటుంది. ఇలా ఆర్టీసీ ఎన్నికల్లో ఈ రెండు ఎన్నికల పరంగా సంఘాల మధ్య పోరు కన్పిస్తుంది.


