తానూరు: మండలంలోని భోసిలో కొలువుదీరిన కర్ర వినాయకుడిని దర్శించుకునేందుకు శనివారం తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌రావ్, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు హాని కలగకుండా ఒకే వినాయకుని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజించడం గర్వకారణంగా ఉందని గ్రామస్తులను అభినందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వామివారి చిత్రపటం అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉత్తం బాలేరావ్, ఉపసర్పంచ్ లక్ష్మణ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.


