ఉట్నూర్‌రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగుల జీవితాల్లో ‘ఆర్‌సెటి’ వెలుగులు నింపుతోంది. గ్రామీణ యువత, మహిళలు తమకాళ్లపై తాము నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని ఎస్‌బీఐ–గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ (ఆర్‌సెటి) సంస్థ ఉచితంగా ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు కలిగిన నిరుద్యోగ యువతులు, మహిళలకు మగ్గం వర్క్, టైలరింగ్ (కుట్టు మిషన్) పలు రకాల ఉపాధి కోర్సుల్లో ఉచిత భోజన, వసతితో పాటు కోర్సు మెటీరియల్‌ను కూడా అందిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆర్‌సెటి ధ్రువపత్రాలు అందజేస్తున్నారు. 2007 జూన్ 30న సంస్థ ప్రారంభం నుండి ఇప్పటి వరకు 381 బ్యాచ్‌ల్లో 11,059 మందికి శిక్షణ అందించారు. అందులో 9,409 మంది స్వయం ఉపాధిలో స్థిరపడ్డారు. వీరిలో 4,010 మంది స్వయంగా, 4,357 మంది బ్యాంకు రుణాల సహాయంతో వ్యాపారాలు, యూనిట్లు ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకున్నట్లు సంస్థ నిర్వాహకులు పేర్కొంటున్నారు.
బాధ్యతగా భావిస్తున్నాం..
గ్రామీణ ప్రాంత మహిళలకు టైలరింగ్, మగ్గం వర్క్‌లో నాణ్యమైన శిక్షణ అందిస్తున్నాం. వారిలో నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా స్వయం ఉపాధి పొందేలా చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాం. – బి.మౌనిక,
మగ్గం వర్క్ ఇన్‌స్ట్రక్టర్
సద్వినియోగం చేసుకోవాలి
‘గ్రామీణ యువత, మహిళల్లో స్వయం ఉపాధి సాధన కోసం ఉట్నూర్ ఎస్‌బీఐ ఆర్‌సెటీ సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. ని రుద్యోగులను వ్యాపారవేత్తలు గా తీర్చిదిద్దడమే మా సంస్థ ము ఖ్య ఉద్దేశం. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. – నరసింహారావు,
డైరెక్టర్, ఎస్‌బీఐ ఆర్‌సెటీ, ఉట్నూర్
ఆర్థిక ప్రాధాన్యత పెరిగేలా..
‘ఆధునిక పద్ధతులు, మోడల్స్ నేర్పిస్తూ మహిళలకు స్వయం ఉపాధిపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నాం. శిక్షణ అనంతరం వారు సొంతంగా కుట్టు శిక్షణ కేంద్రాన్ని లేదా షాప్‌ను ప్రారంభించవచ్చు.
– జి.స్వరూప,
టైలరింగ్ ఇన్‌స్ట్రక్టర్, వరంగల్
కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలు, యువతులు


