బోధనలో నవ్యత.. నాణ్యత దిశగా అడుగులు
ఆచరణతో ఫలితాలు అమోఘం..
దేశ విద్యా పర్యటనలో జిల్లా ఉపాధ్యాయుడు మాదరి ఎల్లన్న
నిర్మల్‌ఖిల్లా: ‘పిల్లలకు పాఠం చెప్పడం మాత్రమే కాదు.. పాఠాన్ని వారు స్వీయానుభవ వాతావరణం కల్పించాలి. ప్రశ్నించేలా, ఆలోచించేలా, సమస్యలను పరిష్కరించేలా ప్రోత్సహించాలి. అప్పుడే నిజమైన అభ్యసనం సాధ్యమవుతుంది..’ అని సింగపూర్ విద్యా పర్యటన నుంచి తిరిగి వచ్చిన నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్‌పాడ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మాదరి ఎల్ల న్న అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికై న 29 మంది ఉపాధ్యాయుల బృందంతో ఈ నెల 12 నుంచి 19 వరకు సింగపూర్‌లో విద్యా పర్యటనలో పాల్గొన్నారు. శిక్షణలో ప్రతిభ కనబర్చినందుకు ప్రశంసాపత్రం అందుకున్నారు. అక్కడి పాఠశాలల్లో ఆధునిక బోధనా విధానాలను వివరించారు.
పర్యటనలో ఆకట్టుకున్న అంశాలు
సింగపూర్‌లోని సెయింట్ పాట్రిక్స్ పాఠశాల, కెల్లాక్స్ పాఠశాలలను సందర్శించాం... ఉపాధ్యాయుడు బోధించే వ్యక్తిగా కాకుండా.. విద్యార్థులను ఆలోచింపజేసే మార్గదర్శిగా వ్యవహరిస్తున్న విధానం ఆకట్టుకుంది. తరగతి గదిలో పిల్లల భాగస్వామ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం, సహచర అభ్యసనం వంటి అంశాలను బోధనలో భాగం చేశారు.
ఆ విధానాలను ఇక్కడి పాఠశాలల్లో
అమలు పర్చవచ్చా?
యథాతథంగా కాకున్నా వాటి వెనుక ఉన్న ఆలోచనను మన పరిస్థితులకు అనుగుణంగా మలచుకోవాలి. అందుబాటులో ఉన్న వనరులతోనే ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టవచ్చు. ప్రాథమిక స్థాయిలో ఆటలు, కథలు, పాటలు, బొమ్మలు, స్థానిక వస్తువులతో బోధనను మరింత ఆనందదాయకంగా మార్చవచ్చు. అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానాన్ని కార్యాచరణ ఆధారిత అభ్యసనంతో బలోపేతం చేయవచ్చు.
అక్కడి బోధనా పద్ధతుల్లో ప్రత్యేకతలు
ఆట.. కథ.. పాట.. బొమ్మలతో కూడిన కృత్యాలు.. సాంకేతికత ఇవన్నీ అక్కడి బోధనలో సహజంగా కలిసిపోయాయి. పిల్లలు పుస్తకంలోని విషయాలను చదవడం కాకుండా, వాటిని స్వయంగా పరిశీలించి, చర్చించి, అనుభవించి నేర్చుకునే వాతావరణం కనిపించింది. విద్యార్థుల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. నిరంతర మూల్యాంకనం ద్వారా పిల్లల అభ్యసన స్థాయిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
మీ పాఠశాలలో ఎలా
ఉపయోగించబోతున్నారు?
తోటి ఉపాధ్యాయులతో పంచుకుంటాను. పాఠశాల అవసరాలకు అనుగుణంగా చిన్నచిన్న మార్పులతో ప్రారంభిస్తాం. ఒక ఉపాధ్యాయుడి అనుభవం మొత్తం పాఠశాల అభ్యసన వాతావరణాన్ని మార్చగలిగితే.. అది నిజమైన అంతర్జాతీయ ఎక్స్‌పోజర్‌కు అర్థం అని భావిస్తున్నా.


