తాంసి: భీంపూర్ మండలంలోని అంతర్గాం శివారులో గురువారం పెద్దపులి సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. అంతర్గాం శివారులోని పంటచేలకు సమీపంలో ఉన్న గుట్ట సమీపంలో పులి సంచరించినట్లు రైతులు పులి పాదముద్రలను గుర్తించారు. వారం రోజుల క్రితం పులి సంచారంతో భయాందోళనకు గురైన ఆయా గ్రామాల ప్రజలు పులి కదలికలు లేకపోవడంతో మహారాష్ట్ర వైపు వెళ్లిపోయిందని భావించారు. కానీ మళ్లీ అంతర్గాం శివారులో పులి పాదముద్రలు గుర్తించడంతో పులి ఇక్కడే సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పులి ఎప్పుడు ఎటు వైపు నుంచి వస్తుందోనని మండలంలోని అర్లి(టి), అంతర్గాం, ఇందూర్‌పల్లి, భగవాన్‌పూర్, గోముత్రి గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.


