బాసర ఆలయానికి భద్రత కావాలి | - | Sakshi
Sakshi News home page

బాసర ఆలయానికి భద్రత కావాలి

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

● భక్తులకు ఇబ్బంది లేకుండా ఆధునిక రక్షణ చర్యలు చేపట్టాలి ● చోరీ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి

ఆలయ ప్రాంగణంలోని ప్రతీ మూలను కవర్‌ చేసేలా హైరిజల్యూషన్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

రాత్రి వేళల్లో అదనపు భద్రతా సిబ్బందిని నియమించి నిరంతర గస్తీ నిర్వహించాలి.

గర్భగుడులు, ఆభరణాల గదులు, హుండీల వద్ద బయోమెట్రిక్‌ లేదా డిజిటల్‌ లాక్‌ వ్యవస్థ అమలు చేయాలి.

ఆలయ పరిసరాల్లో తగినంత లైటింగ్‌ ఏర్పాటు చేయాలి.

సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే బాధ్యతను నిర్ధారించే విధానం అమలు చేయాలి.

అత్యవసర పరిస్థితుల్లో స్పందించే ప్రత్యేక భద్రతా నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.

భైంసా/బాసర: దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు, విద్యార్థులు దర్శించుకునే పుణ్యక్షేత్రం బాసర. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఇటీవల చోటు చేసుకున్న చోరీ ఘటన భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మహాకాళి అమ్మవారి గర్భగుడిలో వెండి కిరీటం, హుండీ చోరీ కావడం భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టింది. భవి ష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ అధికారులు, ప్రభుత్వం సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

నిర్లక్ష్యం వద్దు..

బాసర ఆలయానికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ప్రతీరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా అక్షరాభ్యాసాల కోసం చిన్నారులతో వచ్చే కుటుంబాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇలాంటి ప్రముఖ క్షేత్రంలో భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా...

భద్రత పేరుతో భక్తులను ఇబ్బంది పెట్టే విధానాలు కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భద్రత పెంచాలని భక్తులు సూచిస్తున్నారు. దర్శనాలు, అక్షరాభ్యాసాలు, పూజా కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా భద్రతా తనిఖీలు నిర్వహించాలి. ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద స్కానింగ్‌ వ్యవస్థలు ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలు సులభంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.

భద్రతకూ ప్రాధాన్యం...

ప్రస్తుతం బాసర ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా వ్యవస్థను కూడా ఆధునికీకరించడం అత్యవసరమైంది. చదువుల తల్లి కొలువై ఉన్న ఈ మహాక్షేత్ర ప్రతిష్ఠకు భంగం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత భద్రతా ప్రణాళిక అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తుల్లో భద్రతపై నమ్మకం పెంచే చర్యలే భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయగలవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాసర ఆలయం

చేపట్టాల్సిన చర్యలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement