రాలే.. సార్‌! | - | Sakshi
Sakshi News home page

రాలే.. సార్‌!

Jun 25 2026 1:24 AM | Updated on Jun 25 2026 1:24 AM

సర్కారు బడుల్లో హాజరు అంతంతే పది రోజులైనా అటెండెన్స్‌ 35శాతం దాటలే నామమాత్రంగా ‘బడిబాట’ విద్యాశాఖ తీరుపై విమర్శలు

ఆదిలాబాద్‌టౌన్‌: బడులు పునఃప్రారంభమై పది రోజులు గడుస్తున్నా విద్యార్థులు ఇంకా పూర్తి స్థాయిలో పాఠశాలకు హాజరు కావడం లేదు. దీంతో సర్కారు బడులు వెలవెలబోతున్నాయి. గడిచిన పది రోజుల్లో జిల్లాలో హాజరుశాతం కేవలం 35.85 నమోదు కావడం గమనార్హం. అయితే పల్లెల్లో పిల్లలు తల్లిదండ్రుల వెంట పంట చేను పనులకు వెళ్లడం, కేజీబీవీలు, మోడల్‌ స్కూల్స్‌, వసతిగృహా ల్లో ఉంటూ చదివే విద్యార్థులు ఇంకా ఇంటి వద్దనే ఉంటున్నారు. మొహర్రం ఉండడంతో హాజరు శాతం కొంత తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

పెరగని హాజరు శాతం..

జిల్లాలో 679 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, 18 కేజీబీవీలు, 6 మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 56,605 మంది విద్యార్థులున్నారు. ఈనెల 15న పాఠశాలలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సరాసరి 20,291 మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. బడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఒక్కరోజు కూడా 50 శాతం హాజరు నమోదు కాకపోవడం గమనార్హం. విద్యార్థులకు ఇప్పటికే పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్‌లు పంపిణీ చేశారు. మరికొంత మందికి అందించాల్సి ఉంది.

సర్కారు బడిలో ఉన్నారా.. ప్రైవేట్‌ బాట పట్టారా

జిల్లాలో సర్కారు బడుల్లో 56,605 మంది విద్యార్థులు ఉండగా, కనీసం 20వేల మంది విద్యార్థులు బడికి రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కొంత మంది వివిధ కారణాలతో బడికి రాకపోగా, మిగతా విద్యార్థులు ప్రైవేట్‌ వైపు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. పాఠశాలలు తెరువక ముందే ప్రైవేట్‌ యజమాన్యాలు విద్యార్థుల ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారి పాఠశాలల్లో చేర్పించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అసలు ఆ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారా.. లేక ప్రైవేట్‌ బడిబాట పట్టారా అనే సందేహం నెలకొంది. ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేసేందుకు మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు కల్పించినప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. ఈ విద్యా సంవత్సరంలో గతేడాదితో పోల్చితే 30 శాతం పెంచాలని కలెక్టర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే కనీసం పది శాతం కూడా పెరగకపోవడం ఉపాధ్యాయుల పనితీరుకు అద్దం పడుతోంది.

నామ్‌కే వాస్తేగా బడిబాట..

సర్కారు బడుల బలోపేతం కోసం ప్రభుత్వం ఏటా బడిబాట కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ ఏడాది సైతం నెల పాటు కార్యక్రమాన్ని నిర్వహించినా ఆశించిన ఫలితాలు కానరాలేదు. ఈనెల 19 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే సెన్సెస్‌ ఉండడంతో ఉపాధ్యాయులు ఆ విధుల్లో బిజీగా ఉండటం, డ్యూటీలు లేనివారు బడిబాటపై దృష్టి సారించకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదని తెలుస్తోంది.

ఈ ఏడాది పరిస్థితి ఇదీ..

అధికారుల లెక్కల ప్రకారం.. 1వ తరగతి ఈ ఏడాది 2,968 మంది సర్కారు బడుల్లో చేరారు. ఇదిలా ఉండగా 2వ తరగతిలో 5,767, 3వ తరగతిలో 5,262, 4వ తరగతిలో 5,454, 5వ తరగతిలో 5,164, 6వ తరగతిలో 3,603, 7వ తరగతిలో 4,984, 8వ తరగతిలో 5,336, 9వ తరగతిలో 5,566, పదో తరగతిలో 5,859 మంది విద్యార్థులు ఉన్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నారు. అయితే బడికి మాత్రం 20వేల మంది కూడా హాజరు కాకపోవడంతో మిగతా వారు ఏం చేస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.

తేదీ హాజరైన విద్యార్థులు

15 8,906

16 15,473

17 20,236

18 20,189

19 23,546

20 23,735

22 25,402

23 22,840

ఈ నెల 15 నుంచి విద్యార్థుల

హాజరు వివరాలు

జిల్లాలో

ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 739

మొత్తం విద్యార్థులు 56,605

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement