కై లాస్‌నగర్: అనర్హులను తొలగించి పారదర్శకతతో కూడిన ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యంగా చేపట్టిన సర్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ జిల్లాలో గురువా రం నుంచి షురూ కానుంది. జూలై 24వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇంటింటి సర్వే చేపట్టనున్న బీఎల్‌వోలకు ప్రత్యేక కిట్‌లతో పాటు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. దీంతో వారు ఇక క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించనున్నారు. సందేహాల నివృత్తి కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్కులను ఏర్పాటు చేశారు. ఈ ఫారాలు అందించిన ఓటర్ల పేర్లనే ముసాయిదా జాబితాలో ప్రకటించనున్నట్లుగా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రక్రియ నిర్వహణ వివరాలు వెల్లడించారు. దీంతో ప్రతీ ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని విధిగా తీసుకుని వివరాలు నమోదు చేసి తిరిగి అందజేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రు, డీఆర్‌వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ ఇంటికి మూడుసార్లు..
వర్షాకాలం కావడంతో ప్రత్యేక సవరణలో పాల్గొనే బీఎల్‌వోలకు ప్రత్యేకంగా రెయిన్‌కోట్, చేతి గొడుగులు అందజేశారు. వాటితో పాటు ప్యాడ్, రిజిస్టర్, డిక్లరేషన్ ఫారాలు, స్టాప్లర్, పిన్స్, పెన్నులు, పెన్సి ల్లు, బ్యాగులు, ఫారం 6,7తో కూడిన ప్రత్యేక కిట్‌లను ఇప్పటికే అందజేశారు. వీటితో పాటు తమ పరిధిలోని ఓటర్ల సంఖ్యకనుగుణంగా ఎన్యూమరేషన్ ఫారాలను అందించారు. ఈ మేరకు గురువా రం ఉదయం 8గంటల నుంచే బీఎల్‌వోలు తమ పరిధిలోని ఇంటింటికి వెళ్లనున్నారు. ఓటర్లకు ఫారా లను అందజేయనున్నారు. ఏడు నుంచి ఎనిమిది రోజుల పాటు అందజేసి వారి నుంచి ఎకనాలెడ్జ్‌మెంట్ తీసుకుంటారు. తిరిగి తొమ్మిదో రోజు నుంచి పూరించిన ఫారాలను స్వీకరిస్తారు. నిరాక్షరాస్యులైన ఓటర్లు తమ సమాచారాన్ని పూర్తి చేయడంలో అవసరమైన సాయం అందజేస్తారు. 2002 ఓటర్ల జాబితాలో పేర్లు కలిగిన ప్రతీ ఓటరు తమ వివరాలను ఽధ్రువీకరించుకుని బీఎల్‌వోలకు అందజేయాల్సి ఉంటుంది.
2002లో ఓటు హక్కు లేకుంటే ...
ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికి 2002 ఓటర్ల జాబి తాలో పేరు లేనటువంటి ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి వారు తమ తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల ఓటరు వివరాల ఆధారంగా సంబంధిత ఫారాలను పూర్తి చేసి సంతకం చేయడం లేదంటే బొటినవేలుముద్ర వేసి బీఎల్‌వోలకు ఎన్యూమరేషన్ ఫారాలను అందించే వెసులుబాటు ఉంది. ఇలాంటి వారు తమ కుటుంబీకుల వివరాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా స్వయంగా పరిశీలించుకోవచ్చు. ప్రధా న రాజకీయ పార్టీలు సైతం బూత్‌ల వారీగా ప్రత్యేక ఏజెంట్లను నియమించింది. వారి సహకారం కూడా తీసుకోవచ్చు.
అపోహలు వీడి సహకరించాలి
ఎస్‌ఐఆర్ ప్రక్రియతో ఓట్లు తొలగిపోతాయనే అపోహలను ప్రజలు నమ్మవద్దు. తమ ఇంటి వద్దకు వచ్చే బీఎల్‌వోలకు స్వచ్ఛందంగా వివరాలు అందజేయాలి. ప్రక్రియ పారదర్శకంగా నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా సహకరించాలి. ఓటర్ల జాబితాలోని లోపాలు సరిదిద్దడంతో పాటు మరణించిన, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న డూప్లికేట్ ఓట్లను తొలగించడం జరుగుతుంది. అలాగే 1అక్టోబర్ 2026 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి పేరును తుది జాబితాలో చేర్చేలా చూస్తాం. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోవడంతో పాటు వాటిని పూర్తి చేసి సకాలంలో బీఎల్‌వోలకు అందజేసి సహకరించాలి.
– రాజర్షి షా, కలెక్టర్
అందుబాటులో హెల్ప్‌డెస్క్‌లు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రజల్లో ఉన్న సందేహాల నివృత్తి కోసం జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్కులను ఏర్పాటు చేశారు. ఓటరు జాబితాలతో పాటు ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. ఇవే కాకుండా సందేహాల నివృత్తి లేదా ఇతర సమాచారం కోసం కేంద్ర ఎన్నికల సంఘం టోల్‌ఫ్రీ నంబర్ 1950ని సైతం సంప్రదించవచ్చు.


