జిల్లాకు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటేలా శాఖల వారీగా లక్ష్యాల నిర్దేశం నర్సరీల్లో సిద్ధంగా పలు రకాల మొక్కలు కార్యాచరణ సిద్ధం చేస్తున్న అధికారులు
కై లాస్‌నగర్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చదనం పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ (2026–27) సంవత్సరానికి గాను జిల్లాకు 38.94లక్షల మొక్కలను లక్ష్యంగా కేటాయించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది. మరోవైపు అవసరమైన మొక్కలను సరఫరా చేసేందుకు డీఆర్డీఏ, అటవీశాఖ నర్సరీలను సిద్ధం చేసింది. నాటేందుకు వీలుగా మొక్కలను అందుబాటులో ఉంచింది. ఇప్పటికే అటవీశాఖ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించగా మిగతాశాఖలు సైతం ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి.
ఇతర శాఖల్లో ...
సాగునీటి పారుదలశాఖకు 22వేలు, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖకు 20వేలు, ఎకై ్సజ్ శాఖకు 6వేలు, పరిశ్రమలు, విద్యాశాఖకు 5వేలు, రెవెన్యూ, ఆర్టీసీ, సోషల్ వెల్ఫేర్, ఉన్నత విద్య, యువజన, సర్వీస్‌ల, పశు సంవర్ధకశాఖ, విద్యుత్ శాఖలకు వెయ్యి చొప్పున, దేవాదాయశాఖకు 2వేలు, ఇతర శాఖలకు మరో వెయ్యి చొప్పున మొక్కలు నాటేలా లక్ష్యంగా కేటాయించారు. బీసీ వెల్ఫేర్, సివిల్ సప్లై, మత్స్యశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, ఇంటర్మీడియెట్ విద్య, మార్కెటింగ్, మైనార్టీ సంక్షేమం, ఆర్‌డబ్ల్యూఎస్ వంటి ప్రభుత్వ శాఖలను వన మహోత్సవం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ శాఖలకు ఒక్క మొక్కను కూడా కేటాయించలేదు.
నర్సరీల్లో సిద్ధంగా మొక్కలు
జిల్లాలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు సరఫరా చేసేందుకు గాను గ్రామాల్లో డీఆర్డీఏ ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నర్సరీలను ఏర్పాటు చేశారు. అలాగే అటవీశాఖ ఆధ్వర్యంలోనూ శాఖా పరమైన ఎనిమిది నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టారు. అవెన్యూ ప్లాంటేషన్‌తో పాటు ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో నాటేందుకు వీలుగా ఉండే వేప, మర్రి, రావి, చింత, కానుగ, గుల్‌మోర్, సుబాబుల్‌తో పాటు రోడ్లు, ఇళ్లలో నాటేందుకు అవసరమైన గులాబీ, మల్లె, మందార, చామంతి వంటి పూల మొక్కలు, జామ, సీతాఫలం, అల్లనేరేడు వంటి పండ్ల మొక్కలను నర్సరీల్లో పెంచారు. ప్రస్తుతం అన్ని నర్సరీల్లోనూ అందుబాటులో ఉంచారు. వర్షాలు కురిసే కొద్ది శాఖల వారీగా మొక్కలను తీసుకెళ్లి నాటనున్నారు. మున్సిపాలిటీల్లోని వార్డులు, గ్రామాల్లో ప్రజలకు ఒక్కో ఇంటికి ఆరు చొప్పున అందించనున్నారు.
డీఆర్డీఏ, అటవీ శాఖలదే కీలక బాధ్యత
ప్రభుత్వం ఈ ఏడాదికి గాను జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో అత్యధికంగా డీఆర్డీఏకు నిర్దేశించింది. ఆ తర్వాత ఆదిలాబాద్ మున్సిపల్‌తో పాటు జిల్లా అటవీ, వ్యవసాయ శాఖలకు కేటాయింపులు చేసింది. మిగతా శాఖలకు సంబంధించి ఖాళీగా ఉన్న ప్రదేశాలు, మొక్కలు నాటేందుకు వీలుగా ఉన్న అవకాశాలకనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ వంటి విద్యాసంస్థల్లోనూ మొక్కలు నాటాలని యంత్రాంగం నిర్ణయించింది. కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా ఇటీవల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా అటవీశాఖ ఇప్పటికే 23వేల మొక్కలను నాటింది.
ప్రధాన శాఖల వారీగా
మొక్కలు నాటాల్సిన లక్ష్యం
శాఖలు నాటాల్సిన మొక్కలు
డీఆర్డీఏ 24.87లక్షలు
అటవీశాఖ 4.25లక్షలు
వ్యవసాయ 2.25లక్షలు
ఆదిలాబాద్ మున్సిపల్ 5.10లక్షలు
పోలీస్ 80వేలు
ఆర్‌అండ్‌బీ 50వేలు
ఐటీడీఏ ఉట్నూర్ 50వేలు
వంద శాతం మొక్కలు నాటుతాం
జిల్లాకు కేటాయించిన వనమహోత్సవ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన శాఖలన్నింటికీ లక్ష్యాలను నిర్దేశించాం. ఆదిశగా మొక్కలు నాటేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. లక్ష్యం మేరకు వందశాతం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి.
– ఎస్.రాజేశ్వర్, అదనపు కలెక్టర్


