పంట డబ్బులొచ్చినయ్‌ | - | Sakshi
Sakshi News home page

పంట డబ్బులొచ్చినయ్‌

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

● జిల్లాలో మొక్కజొన్నకు సంబంధించి 3,819 మంది రైతుల నుంచి ప్రభుత్వం మద్దతు ధరతో 2.19లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసింది. ఈ పంటకు సంబంధించి రూ.52.63 కోట్లు రావాలి. ఇందులో మొదటి విడతగా రూ.31.8 కోట్లను 2,624 మంది రైతులఖాతాల్లో ఇదివరకే జమ చేసింది. మిగిలిన రూ.21.55 కోట్లకు గాను తాజాగా రూ.11.22 కోట్లను విడుదల చేసింది. మరో రూ.10.33 కోట్లు త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ● జొన్న పంటకు సంబంధించి జిల్లాలో మే మొదటి వారంలో 26 కేంద్రాల్లో రైతుల నుంచి మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లు షురూ చేసింది. 25,591 మంది రైతుల నుంచి 7.31లక్షల క్వింటాళ్ల జొన్న పంటను కొనుగోలు చేసింది. ఇందుకు గాను రూ.270.59 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. మొదటి విడతగా రూ.83.46 కోట్లను విడుదల చేసింది. మిగతావి వారం రోజుల్లోగా విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం విడుదలైన నిధులు రైతుల ఖాతాల్లో నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌ ద్వారా జమ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

రైతుల ఖాతాల్లో జమ

మొక్కజొన్నకు రూ.11.22 కోట్లు

జొన్నకు రూ.83.46 కోట్లు విడుదల

రెండు మూడు రోజుల్లో మిగతావి కూడా..

ఆదిలాబాద్‌టౌన్‌: ఆరుగాలం కష్టించి పండించిన పంట దిగుబడులను విక్రయించి నెలరోజులు గడిచినా డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఓ వైపు వర్షాకాలం సీజన్‌ ప్రారంభం కావడం.. పెట్టుబడికి చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ప్రభుత్వం సోమవారం జొన్న, మొక్కజొన్న పంటలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసింది. మార్క్‌ఫెడ్‌ అధికారులు సంబంధిత రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే మొదట విక్రయించిన వారికి మాత్రమే ప్రస్తుతం జమ కాగా.. మిగతా వారికి రెండుమూడు రోజుల్లో జమ కానున్నట్లుగా మార్క్‌ఫెడ్‌ అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

రైతుల్లో హర్షం..

గత వానాకాలం సీజన్‌లో అధిక వర్షాలతో పత్తి, సోయా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దిగుబడి తగ్గింది. పంటకు గిట్టుబాటు ధర కూడా లభించలేదు. రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. యాసంగిలో రైతులు జొన్న, మొక్కజొన్న సాగు చేశారు. అయితే ఆశించిన దానికంటే అధిక దిగుబడి వచ్చింది. ఎకరానికి 15 నుంచి 25 క్వింటాళ్ల వరకు జొన్న పంట పండిందని రైతులు చెబుతున్నారు. ఈ పంటను ప్రభుత్వరంగ సంస్థ మార్క్‌ఫెడ్‌ క్వింటాలుకు రూ.3,699 మద్దతు ధరతో కొనుగోలు చేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన డబ్బులు ఖాతాల్లో జమ చేయడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఈ విషయమై మార్క్‌ఫెడ్‌ డీఎం మహేశ్‌కుమార్‌ను వివరణ కోరగా, ప్రభుత్వం జొన్న, మొక్కజొన్న పంటలకు సంబంధించి డబ్బులను సోమవారం విడుదల చేసిందని, వాటిని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని తెలిపారు. మిగతావి రెండు మూడు రోజుల్లో జమ అవుతాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement