సాక్షి,ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో భాగంగా ఆ సమూహంలో విద్యుత్ లైన్ల ఎత్తు పెంచేందుకు పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇందులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఈనెల 18న ‘అంతా డొల్లా..!’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈమేరకు ఆ శాఖ అధికారులు స్పందించారు. వరంగల్‌లో ఎస్‌ఈ కార్యాలయం ఉండగా, వారి ఆదేశాల మేరకు క్వాలిటీ కంట్రోల్ ఏడీ తిరుపతి, స్థానిక విద్యుత్ శాఖ ఇన్‌చార్జి ఏడీ జనార్దన్ రెడ్డి, ఏఈ సదానందం సోమవారం ఆ పనులను పరిశీలించారు. విద్యుత్ టవర్లు, స్తంభాలు, కండక్టర్ వైర్లు, సైడ్ ఆర్మ్‌లు ఇలా అన్ని అంశాల్లో పరిశీలన చేశారు. నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. ఈ విషయంలో ఆదిలాబాద్ విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషారావును వివరణ కోరగా, క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారని తెలిపారు. సాధారణంగా ఇది జరిగేదేనని వివరించారు. లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలని అందులో సూచిస్తారని పేర్కొన్నారు.


