ఆదిలాబాద్: అర్హులందరికీ ఓటు హక్కు ఉంటుందని, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో సరిచూసుకోవాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సోమవారం ‘సర్’ కార్యక్రమం, నషా ముక్త్ భారత్‌పై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా చేపట్టిన 2కే రన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ ఓటరు తమ వివరాలను ఎన్యుమరేటర్లకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం 20 ఏళ్లకు ఒకసారి చేపట్టే ఈ ప్రక్రియ ద్వారా 2002 నాటి గణన ఆధారంగా ఓటర్ల మ్యాపింగ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఓట్ల తొలగింపుపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఎన్యుమరేషన్ ఫారం నింపి తమ ఓటును సుస్థిరం చేసుకోవాలని సూచించారు. అలాగే యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నషా ముక్త్ భారత్ సాధనలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం రన్‌లో విజేతలుగా నిలిచిన వారికి సర్టిఫికెట్లు అందించారు. ఇందులో డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్ రావు, డీఎంహెచ్‌వో సాధన, డీవైఎస్‌వో దయానంద రెడ్డి, డీడబ్ల్యూవో మిల్కా, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.


