మీసేవ కేంద్రాల్లో డిజిటల్ విధానం దరఖాస్తుదారుడి మొబైల్‌కే అక్నాలెడ్జ్‌మెంట్ హైపర్ లింక్ పొరపాటున డిలిట్ అయితే తిరిగి పంపించే వెసులుబాటు
నిర్మల్‌చైన్‌గేట్/కాగజ్‌నగర్‌టౌన్: మీసేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇచ్చే కాగితపు రశీదులకు కాలం చెల్లింది. పేపర్ లెస్ పాలనలో భాగంగా నిర్మల్, కుమురంభీం జిల్లాల్లోని 126 మీసేవ కేంద్రాల్లో ఈ నెల 19 నుంచి డిజిటల్ రశీదుల విధానం అమల్లోకి వచ్చింది. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (మీసేవ) కమిషనర్ ఆదేశాల మేరకు.. ఇకపై కాగితపు ప్రింట్లకు బదులుగా దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా అక్నాలెడ్జ్‌మెంట్ హైపర్ లింక్ వస్తుంది. పాత పద్ధతిలో ప్రింట్ ఇస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఎస్‌ఎంఎస్ డిలిటైనా తిరిగి పంపించే సౌకర్యం ..
మొబైల్‌కు వచ్చిన ఎస్‌ఎంఎస్ పొరపాటున డిలిట్ అయినా లేదా పోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీసేవ అప్లికేషన్‌లో సదరు ఎస్‌ఎంఎస్‌ను తిరిగి పంపించే సౌకర్యాన్ని కల్పించారు. దరఖాస్తుదారులు కోరితే ఆపరేటర్లు మళ్లీ మెసేజ్ పంపేలా సహాయం అందిస్తారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
కొత్త నిబంధనల ప్రకారం.. జిల్లాలోని మీసేవ నిర్వాహకులు, ఆపరేటర్లు దరఖాస్తు దారుల నుంచి కచ్చితమైన, యాక్టివ్ ఉన్న మొబైల్ నంబర్లను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. జూన్ 19 నుంచి ఎలాంటి ఫిజికల్ (కాగితపు) రశీదులను ప్రింట్ తీసి ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి పాత పద్ధతిలోనే కాగితపు రశీదులు జారీ చేస్తే జిల్లాలోని సదరు కేంద్రాలపై కఠిన చర్యలు ఉంటాయని ఐటీ, ఈఎస్‌వో కమిషనర్ ఉత్తర్వులుల్లో హెచ్చరించారు. అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్న కరెక్ట్ మొబైల్ నంబర్‌ను మాత్రమే ఇవ్వాలని, లేదంటే భవిష్యత్‌లో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కష్టమవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
మరింత మెరుగు
మీ సేవ కేంద్రాల్లో రెవెన్యూ లాగిన్‌లో ప్రజలు ఆదాయ, నివాస, కుల, సర్టిఫికెట్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఫిజికల్ దరఖాస్తు ఫారాలు కార్యాలయాలకు పంపిస్తే అక్కడ అధికారులకు దొరక్క నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. మళ్లీ జిరాక్స్ ప్రతులను తీసుకెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పేపర్‌లెస్ సేవలతో ఆ పరిస్థితి ఉండదు. – సిరాజ్,
మీసేవ కేంద్రం నిర్వాహకుడు, కాగజ్‌నగర్
పక్కాగా అమలు
జిల్లాలో పేపర్‌లెస్ సేవలు ఈ నెల 19 నుంచి పక్కాగా అమలు చేస్తున్నాం. ప్రజలు దరఖాస్తు చేసుకున్న అనంతరం వారికి మొబైల్‌లో మెసేజ్ వస్తుంది. సంబంధిత కార్యాలయ అధికారి లాగిన్‌లోకి దరఖాస్తు చేరుకుంటుంది. ప్రజల దరఖాస్తు స్థితిని మొబైల్‌లోనే చూసుకోవచ్చు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు.
– గౌతం, మీసేవ కేంద్రాల జిల్లా అధికారి
రశీదు ఇచ్చే పద్ధతికి స్వస్తి
కాగిత రహిత పాలనే ధ్యేయంగా నూతన విధానం అమలు చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇప్పటికే మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు అందజేశాం. మీ సేవ కేంద్రాల్లో పేపర్ రశీదు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతున్నాం.
– నదీమ్, ఈ మేనేజర్, నిర్మల్
మొబైల్, రశీదు లింక్..
కొత్త విధానం ప్రకారం.. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే, దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్‌ఎంఎస్ వస్తుంది. అందులో అప్లికేషన్ నంబర్, సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలతో పాటు ఒక హైపర్ లింక్ ఉంటుంది. పౌరులు ఆ లింక్‌పై క్లిక్ చేసి తమ అక్నాలెడ్జ్‌మెంట్ రశీదును ఎప్పుడైనా వీక్షించవచ్చు.. డౌన్‌లోడ్ చేసు కోవచ్చు.. లేదా ప్రింట్ తీసుకోవచ్చు. సర్టిఫికెట్ చేతికి వచ్చే వరకు ఈ ఎస్‌ఎంఎస్‌ను సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల కాగితాలు పోగొట్టుకునే భయం ఉండదు.


