దస్తురాబాద్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మున్యాల తండాకు చెందిన బానవత్ రాజు(48)కు భార్య వనిత, ఇద్దరు కుమారులు శంకర్, సాయి, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. ఇద్దరు కుమారులు విదేశాలలో ఉద్యోగాలు కోల్పోయి ప్రస్తుతం ఇంటివద్ద ఖాళీగా ఉంటున్నారు. దీనికి తోడు కుమార్తె న్యూమోనియా వ్యాధి బారిన పడటంతో చికిత్స నిమిత్తం అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని తండ్రి సక్లనాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
మద్యానికి బానిసై యువకుడు..
సాత్నాల: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు బోరజ్ మండలం పెండల్‌వాడకు చెందిన గేడం జ్ఞానేశ్వర్ (23) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సావాపూర్‌లో ఒక ఇంట్లో వంట చేయడానికి వెళ్లిన అతని తల్లి వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి విగత జీవుడై కనిపించాడు. మృతుని తండ్రి గతంలోనే మృతి చెందగా తల్లి, చెల్లితో ఉంటున్నాడు.
పాముకాటుకు ఒకరు మృతి
కాగజ్‌నగర్‌టౌన్: మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన బొమ్మెళ్ల సత్తయ్య (63) పాముకాటుతో మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఇంటి ఆవరణలో నేలపై నిద్రిస్తున్న సత్తయ్యను పాము కాటువేయగా కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం మంచిర్యాలకు రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
సిర్పూర్(టి): మండలంలోని టోంకిని గ్రామ సమీ పంలోని పెన్‌గంగ నది ఒడ్డున సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గమనించిన పంచా యతీ కార్యదర్శి సందీప్ పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్సై సాగర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతునికి 30 నుంచి 40 సంవత్సరాల వరకు వయస్సు ఉంటుందని, నీలం రంగు షర్టు, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. ఎడమచేతికి, ఎడమ కాలికి నల్లని దారం కలిగి ఉన్నాడని, గుర్తుపట్టిన వారు పోలీసులను సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
బాసర గోదావరిలో
యువకుడి మృతదేహం
బాసర:బాసర గోదావరిలో మునిగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. భైంసాలోని కొర్బగల్లి గ్రామానికి చెందిన బొండ్ల అక్షయ్ కుమార్ (23) ఈ నెల 18న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. 21న అతని మోటార్ సైకిల్ గోదావరి వంతెన సమీపంలో లభ్యమైంది. సోమవారం ఉదయం బాసర గోదావరి ప్రధాన ఘాట్ ఎదురుగా నదిలో మృతదేహం లభ్యమైంది. మృతుని తండ్రి బొండ్ల నాగనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ముధోల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ తెలిపారు.
ఆటో బోల్తాపడి ముగ్గురికి గాయాలు
కోటపల్లి: మండలంలోని పార్‌పల్లి సమీపంలోని 63వ జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలైన ఘటన చోటు చేసుకుంది. పిన్నారంకు చెందిన ఆటో డ్రైవర్ కుదురుపాక సతీశ్ చెన్నూర్ నుంచి పార్‌పల్లి వైపు వెళ్తుండగా ఫారెస్టు చెక్‌పోస్టు సమీపంలోకి రాగానే ఎదురుగా సిరోంచ నుంచి వస్తున్న సర్వేంద్ర అనే కారు డ్రైవర్ ఫారెస్టు చెక్‌పోస్టు టోల్ ఛార్జీలు పడకుండా ఉండేందుకు ఎదురుగా వస్తున్న ఆటో రూట్ నుంచి వెళ్లే క్రమంలో ఆ టోను ఢీకొట్టాడు. దీంతో ఆటో రోడ్డు పక్కన అటవీ ప్రాంతంలో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న కొప్పుల బాపు, ఇరుగురాల్ల సాత్వికకు స్వల్పంగా డ్రైవర్ సతీష్‌కు తీవ్రగాయాలుకాగా 108లో చెన్నూర్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.


