బట్టల దుకాణంలో పుస్తకాల అమ్మకం | - | Sakshi
Sakshi News home page

బట్టల దుకాణంలో పుస్తకాల అమ్మకం

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

● నిబంధనలకు పాతర ● సీజ్‌ చేసిన విద్యాశాఖ అధికారులు

మంచిర్యాలఅర్బన్‌: ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు పాతరేశాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నాయి. ఈ నెల 6న ‘పుస్తకాలు, ధరల మోత’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అనుమతి, ఎమ్మార్పీ లేకుండా పుస్తకాలు విక్రయిస్తున్నారని సోమవారం మంచిర్యాలలో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్థానిక గౌతమినగర్‌లో ట్రినిటీ హైస్కూల్‌ ఎదురుగా ఉన్న దుకాణాల్లో ఎమ్మార్పీ లేకుండా పుస్తకాలు విక్రయిస్తున్నారని పీడీఎస్‌యూ, ఏఐఎస్‌బీ, యూఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మంచిర్యాల ఎంఈవో మాళవీదేవికి వినతిపత్రం అందజేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు విద్యాశాఖ సహాయ సంచాలకులు(ఏడీ) లలిత, ఎంఈవో మాళవీదేవి దుకాణాన్ని సందర్శించి సీజ్‌ చేశారు. మార్కెట్‌ రోడ్డులోని బట్టల దుకాణంలో పుస్తకాలు విక్రయిస్తున్నారని ఓ పేరెంట్‌ ఫిర్యాదు చేయగా.. విద్యాశాఖ అధికారులు తనిఖీ చేశారు. గ్రీన్‌వుడ్‌ పాఠశాలకు చెందిన పాఠ్యపుస్తకాలు లభ్యం కావడంపై ఏడీ లలిత, ఎంఈవో మాళవీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలు ఎందుకు ఉన్నాయని యజమానిని ప్రశ్నించగా.. ఓ వ్యక్తికి అద్దెకు ఇచ్చామంటూ సమాధానం ఇచ్చారు. దుకాణాన్ని సీజ్‌ చేయడంపై మల్లగుల్లాలు పడ్డారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భద్రత కల్పించారు. సోమవారం రాత్రి వరకు పుస్తక దుకాణం సీజ్‌పై ఎటూ తేల్చలేదు. ఉన్నతాధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటామని ఎంఈవో మాళవీదేవి తెలిపారు. తనిఖీల విషయం తెలుసుకుని పాత కలెక్టరేట్‌ సమీపంలో కార్పొరేట్‌ పాఠశాల పుస్తకాలు విక్రయిస్తున్న మరో బట్టల దుకాణం నిర్వాహకుడు, ఇతర అనుబంధ పుస్తక దుకాణాల యజమానులు దుకాణాలు మూసివేయడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement