అటవీ అధికారులపై దాడికి యత్నం | - | Sakshi
Sakshi News home page

అటవీ అధికారులపై దాడికి యత్నం

Jun 23 2026 12:18 AM | Updated on Jun 23 2026 12:18 AM

జన్నారం: పెట్రోలింగ్‌కు వెళ్లిన అటవీశాఖ అధికారులపై గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటన జన్నారం రేంజ్‌ పరిధిలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు జీపు డ్రైవర్‌ సాజిద్‌, అటవీ అధికారుల కథనం ప్రకారం.. ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మండలంలోని బాదంపల్లి, పుట్టిగూడ గ్రామాల సమీపంలో పైడిపల్లి బీట్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌, రాయికుంట బీట్‌ ఆఫీసర్‌ మక్బూల్‌, తాళ్లపేట బీట్‌ ఆఫీసర్‌ ఎండీ రహీమొద్దీన్‌, బేస్‌ క్యాంపు సిబ్బంది ఆదివారం రాత్రి పెట్రోలింగ్‌ నిర్వహించారు. అధికారుల రాక ను గమనించిన దుండగులు అసభ్య పదజాలంతో ధూషిస్తూ వారిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బేస్‌ క్యాంపు మంచెను పాక్షికంగా ధ్వంసం చేశారు. అప్రమత్తమైన అటవీ సిబ్బంది, జీపు డ్రైవర్‌ చాకచక్యంగా తప్పించుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. ఈ విషయమై జన్నారం ఇన్‌చార్జి రేంజ్‌ ఆఫీసర్‌ జి.వికాస్‌ను సంప్రదించగా దాడికి యత్నించిన మాట నిజమేనని, ఈ విషయంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎస్సై గుర్రం ఉదయ్‌ కిరణ్‌ను సంప్రదించగా అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement