నిర్మల్ ఖిల్లా: నిర్మల్ రూరల్ మండలం తల్వేదకు చెందిన గడ్చంద సాయన్న ఉపాధి నిమిత్తం ఏడాదిన్నర క్రితం యూఏఈలోని దుబాయ్‌కి వెళ్లి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సోనాపూర్ కార్మికుల శిబిరంలో నివాసముంటున్న సాయన్నకు ఇటీవల పక్షవాతం వచ్చింది. తోటి కార్మికులు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో సాయన్నను స్వదేశానికి పంపించాలని అతని భార్య కమల, కుమారుడు అజయ్ పలుమార్లు కంపెనీ యాజమాన్యాన్ని, సంబంధిత ఏజెన్సీని కోరినా స్పందన లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసి సమస్య విన్నవించారు. ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీ రాష్ట్ర సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను కలిసి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా స్వదేశ్ పరికిపండ్ల మాట్లాడుతూ ఢిల్లీలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ కార్యాలయానికి, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖకు ఈ మెయిల్ ద్వారా విషయాన్ని తెలియజేశామని, వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతామని భరోసానిచ్చారు.


