‘అన్న అక్క’తో ఏఐ బోధన | - | Sakshi
Sakshi News home page

‘అన్న అక్క’తో ఏఐ బోధన

Jun 22 2026 12:06 AM | Updated on Jun 22 2026 12:06 AM

విద్యారంగంలో సరికొత్త విప్లవం

ఇప్పటికే డిగ్రీ విద్యార్థులు, లెక్చరర్లకు శిక్షణ

6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు తరగతులు

జూలై 1 నుంచి కార్యక్రమానికి శ్రీకారం

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రస్తుత కాలంలో సాంకేతికత ప్రతీ రంగాన్ని ప్రభావితం చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగంలోనూ మా ర్పులు చోటు చేసుకుంటున్నాయి. సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థులకు ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను పరిచయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం డిగ్రీ విద్యార్థులను సంసిద్ధం చేసింది. ఒకప్పుడు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిందే విద్యార్థులకు జ్ఞాన వనరుగా ఉండేది. ప్రస్తుతం ఏఐ సాయంతో విద్య మరింత సులభంగా అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అన్న అక్క మెంటర్‌షిప్‌ టీచింగ్‌ ఇంటర్‌షిప్‌’ కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. జూలై 1 నుంచి డిగ్రీ విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. వారికి ఎంపిక చేసిన పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏఐ కంప్యూటర్‌ విద్యను బోధించనున్నారు.

లెక్చరర్లు, డిగ్రీ విద్యార్థులకు శిక్షణ..

ఈ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ కళాశాల విద్యార్థులతో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యాబోధన చేయనుంది. డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థులతో పాటు లెక్చరర్లకు ఇటీవల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏఐ బోధనలో విద్యార్థులకు స్నేహపూర్వకంగా మార్గనిర్దేశం చేసే డిజిట ల్‌ పాత్రలను రూపొందించారు. పాఠ్యాంశాలను కేవలం చదవడం కాకుండా చిత్రాలు, యానిమేషన్లు, వీడియోలు, కథలు, ప్రశ్నోత్తరాల రూపంలో అందించడం ద్వారా విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటున్నారు. పాఠాలు వినడం, చూడడం, ఆచరణలో పెట్టడం ద్వారా అభ్యసన మరింత ప్రభావవంతంగా మారుతోంది.

విద్యార్థి అభ్యసన స్థాయిని గుర్తించి..

జిల్లాలో నాలుగు ప్రభుత్వం డిగ్రీ కళాశాలలతో పాటు ఒక పాలిటెక్నిక్‌ కళాశాల ఉంది. పట్టణంలో ప్రభుత్వ సైన్స్‌, ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌, ఇచ్చోడ, ఉట్నూర్‌లలో ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో సంజయ్‌ గాంధీ పాలిటెక్నిక్‌ కళాశాల ఉంది. వీటిలో చదివే ఫైనలియర్‌ విద్యార్థులు 30 గంటల తరగతులు బోధించాల్సి ఉంటుంది. నెల నుంచి రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకు గాను డిగ్రీ విద్యార్థులకు క్రెడిట్‌ పాయింట్లు కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా ప్రతీవిద్యార్థి నేర్చుకునే సామర్థ్యం ఒకేలా ఉండదు. కొందరు వేగంగా అర్థం చేసుకుంటే, మరికొందరికి అదనపు సమయం అవసరం అవుతుంది. ఏఐ ఆధారిత బోధన ద్వారా ప్రతీ విద్యార్థి అభ్యసన స్థాయిని గుర్తించి, వారికి తగిన విధంగా పాఠ్యాంశాలు అందించే అవకాశం కలుగుతోంది. దీంతో వెనుకబడిన విద్యార్థులు కూడా ఇతరులతో సమానంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది.

నైపుణ్యాలు పెంపొందించేందుకు..

విద్యార్థులు కంప్యూటర్‌, సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించేందుకు ఏఐ ఎంతగానో దోహద పడనుంది. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండడంతో ఇప్పటి నుంచే విద్యార్థులకు పరిచ యం చేస్తున్నారు. దీంతో వారిలో సృజనాత్మకత, స మస్య పరిష్కార సామర్థ్యం, డిజిటల్‌ అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన వంటి నైపుణ్యాలు పెంపొందుతాయి. ఏఐ ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ వారి పనిని మరింత సులభతరం చేసే సాధనంగా మారుతుందని లెక్చరర్లు చె బుతున్నారు. పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేయడం, విద్యార్థుల ప్రగతిని విశ్లేషించడం, అదనపు అభ్యాస సామగ్రిని అందించడం వంటి అంశాల్లో ఏఐ సహా యపడుతోందని పేర్కొంటున్నారు. పాఠశాలల్లో ఇంటర్నెట్‌, డిజిటల్‌ పరికరాలు, విద్యుత్‌ సదుపాయాలు వంటివి అధిగమిస్తే ఈ కార్యక్రమం విద్యారంగంలో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

పాఠాలతో పాటు

ఏఐపై అవగాహన..

అన్న అక్క మెంటర్‌షిప్‌ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూలై 1 నుంచి ప్రారంభించనుంది. డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థులు సమీపంలోని పాఠశాలలకు వెళ్లి ఏఐ విద్యాబోధన చేస్తారు. విద్యార్థులకు ఏఐపై అవగాహన, డిజిటల్‌ లిట్రసీ, కంప్యూటేషనల్‌ థింకింగ్‌, కోడింగ్‌ ప్రాథమిక అంశాలను నేర్పిస్తారు. ఇటీవల డిగ్రీ విద్యార్థులతో పాటు లెక్చరర్లకు ఈ అంశాలపై శిక్షణ కల్పించాం. జిల్లాలో నాలుగు ప్రభుత్వ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు.

– అరుణ్‌, నోడల్‌ అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement