కై లాస్‌నగర్: భూ వివాదాలు, సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టాలని నిర్ణయించింది. దశలవారీగా ఈ ప్రక్రి య నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం జి ల్లాలోని 70 గ్రామాలను ఎంపిక చేసింది. అయితే ఈ సర్వే సాఫీగా సాగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రెగ్యులర్ సర్వేయర్ల కొరత, లైసెన్స్‌డ్ సర్వేయర్లు విధుల నిర్వహణకు విముఖత వ్యక్తం చేయడమే కారణంగా తెలుస్తోంది.
21 మండలాలు.. 10 మందే సర్వేయర్లు
జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖను సర్వేయర్ల కొరత వేధిస్తుంది. జిల్లావ్యాప్తంగా 21 మండలాలకు గాను కేవలం పది మంది మాత్రమే రెగ్యులర్ సర్వేయర్లు ఉన్నారు. దీంతో ఒక్కో సర్వేయర్‌కు రెండేసి మండలాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే దరఖాస్తులు అధికంగా వస్తుండటంతో వారు ఏ మండలంలో సర్వే నిర్వహించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. పనిభారం పెరగడంతో సకా లంలో సర్వే చేపట్టలేని పరిస్థితి. దీంతో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. భూ సర్వే కోసం చలానా చెల్లించిన రైతులు సర్వేయర్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టు కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో గ్రామాల్లో భూ సమస్యలు, వివాదాలు అధికమవుతున్నాయి.
లైసెన్స్‌డ్ సర్వేయర్ల విముఖత
జిల్లాలో ఇప్పటికీ నిజాం కాలంనాటి సర్వే రికార్డులే ప్రధాన ఆధారంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతున్నందున భూముల విభజనలు, బైనంబర్ల సంఖ్య రోజురోజుకు పెరుగతున్నాయి. సరిహద్దులు మారడంతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో భూ వివాదాలు అధికమవుతున్నాయి. ఇలాంటి వాటిని పరిష్కరించి బాధిత రైతులకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సమగ్ర రీసర్వేకు నిర్ణయించింది. తొలి విడతలో 70 గ్రామాలను ఎంపిక చేసింది. స్పష్టమైన హ ద్దులు నిర్ణయించి, ప్రతీ సర్వేనంబర్‌కు భూదార్ కే టాయించాలనే ఉద్దేశంతో ఈప్రక్రియ చేపడుతుంది. సర్వేయర్లు తగినంత లేకపోవడంతో ఇటీవల ని యమించిన లైసెన్స్‌డ్ సర్వేయర్ల ద్వారా చేయించా లని భావిస్తోంది. ఇందుకోసం ఎకరం సర్వేకు రూ. 50 చొప్పున వారికి చెల్లించాలని నిర్ణయించింది. అ యితే ఇదితమకు గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో స ర్వే విధులపై వారు విముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం వారితో అదనపు కలెక్టర్ సమావేశమయ్యారు.ప్రభుత్వం ప్రకటించిన ఎకరానికి రూ. 50 గిట్టుబాటు కాదంటూ అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్. చిత్రుకు వినతిపత్రం అందజేసి తమనిరసన వ్యక్తం చేశారు. స్కీల్డ్ వర్కర్లకు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కనీస వేతనం రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే నిర్వహణ ముందుకు సాగుతుందా లేదా అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
లైసెన్స్‌డ్ సర్వేయర్ల ద్వారానే సర్వే
భూ వివాదాలు పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేకు ఆదేశించింది. తదనుగుణంగా జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేశాం. త్వరలోనే గెజిట్ జారీ చేసి లైసెన్స్‌డ్ సర్వేయర్ల ద్వారా ప్రక్రియ నిర్వహించాలని భావిస్తున్నాం. వారు ముందుకు రాని పక్షంలో ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.
– ప్రభాకర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ


