నిర్మల్ ఖిల్లా: జీవితంలో తండ్రి ఇచ్చే మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అమూల్యమని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గోమస జసింత్ జోయల్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి డేనియల్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తన విజయ ప్రయాణాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. నిర్మల్‌కు చెందిన ‘జసింత్ జోయల్‘ బీటెక్ 2020లో పూర్తిచేశారు. అనంతరం గ్రూప్–1 లక్ష్యంగా సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నిర్మల్‌లోని సోఫీనగర్ గురుకుల కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న తన తండ్రి డేనియల్ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు బదిలీ కావడంతో ఆరేళ్లపాటు కొడుకుతోపాటు అక్కడే ఉన్నారు. గ్రూప్–1 పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ప్రతీ అంశాన్ని తండ్రితో చర్చించేవాడినని జసింత్ తెలిపారు. ఉపాధ్యాయుడైన తన తండ్రి చదువుకు సంబంధించిన అంశాలతోపాటు ఆర్థిక స్వేచ్ఛ, పొదుపు, కుటుంబ బంధాలు, జీవన విధానం వంటి విషయాలపై విలువైన సూచనలు, సలహాలు అందించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహమే గ్రూప్–1లో విజయానికి బాటలు వేశాయని తెలిపారు. ప్రస్తుతం తాను కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘నాన్న... మీ ప్రేమ, ప్రోత్సాహం, మార్గదర్శకత్వమే మా జీవితాలకు బలమైన పునాది. థాంక్యూ డాడీ... హ్యాపీ ఫాదర్స్ డే’ అని జసింత్ జోయల్ భావోద్వేగ సందేశాన్ని ‘సాక్షి’ తో పంచుకున్నారు..


