బావిలో జారిపడి బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

బావిలో జారిపడి బాలిక మృతి

Jun 21 2026 12:49 AM | Updated on Jun 21 2026 12:49 AM

నార్నూర్‌: ప్రమాదవశాత్తు బావిలో జారిపడి బాలిక మృతిచెందిన ఘటన జామ్‌డా గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జామ్‌డా గ్రామానికి చెందిన పూసం కళాబాయి, షేకు దంపతుల కుమార్తె రత్తుబాయి (15) స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. శనివారం అదే గ్రామానికి చెందిన రైతు వ్యవసాయ క్షేత్రంలో పత్తి విత్తనాలు విత్తేందుకు వెళ్లింది. ఎండ తీవ్రంగా ఉండటంతో దాహార్తి తీర్చుకోవడానికి మధ్యాహ్నం అక్కడే ఉన్న బావి వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయింది. ఈత రాకపోవడంతో నీటిలో కొట్టుమిట్టాడుతుండగా చిన్నారులు గమనించి పొలంలో ఆమె అక్క శ్రీదేవికి చెప్పారు. అక్కడికి చేరుకున్న ఆమె చెల్లిని కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహాయంతో రత్తుబాయిని బయటకు తీసి ఉట్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చదువులో చురుగ్గా ఉండే రత్తుబాయి అకాల మరణం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. తండ్రి షేకు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీ సాయి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement