సాక్షి, ఆదిలాబాద్: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చే స్తోంది. ఎంపిక ప్రక్రియ కోసం గైడ్‌లైన్స్ జారీ చేసింది. అభ్యర్థులకు కేటాయించే మార్కుల పారామీటర్స్‌ను ప్రకటించింది. ఇందులో సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా పది మార్కులు కేటాయించేందుకు అవకాశం కల్పించింది. ఈ తాజా తిరకాసుతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు.
జిల్లాలో 800 ఖాళీలు
గతంలో విద్యార్హతల ఆధారంగా 80, వితంతువులకు ఐదు, అనాథలకు 10, శారీరక, మానసిక సమస్యలున్నవారికి ఐదు మార్కులు కేటాయించేవారు. ఇలా వంద మార్కులకు ఈ అంశాల ఆధారంగా అభ్యర్థులకు కేటాయించి ఎంపిక చేసేవారు. జిల్లాలో 800 ఖాళీలుండగా నిరుద్యోగుల నుంచి తీవ్ర పోటీ ఉండనుంది. సెలక్షన్ కమిటీ సభ్యులు అభ్యర్థులకు వంద మార్కులు కేటాయించేందుకు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇందులో ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా 70, వితంతువులకు ఐదు, అనాఽథలకు 10, శారీరక, మానసిక ఇబ్బందులున్నవారికి 10 మార్కులు కేటాయించనున్నారు. మరో 10 మార్కులను ఇంటర్వ్యూ ఆధారంగా కేటాయించేలా పారామీటర్‌లో పొందుపర్చారు. మెరిట్‌లో మార్కులు కలిసొచ్చినా ఈ ఇంటర్వ్యూ ద్వారా కలిపే మార్కులు ప్రభావితం చేసే అవకాశముందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇందులో పైరవీలు చోటుచేసుకుంటే అర్హులైన అభ్యర్థులు నష్టపోయే అవకాశముందని ఆందోళనకు గురవుతున్నారు.
సెలక్షన్ కమిటీలో సభ్యులు వీరే..
మిషన్ సక్షమ్ అంగన్‌వాడీ, పోషణ్ 2.0లో భాగంగానే ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్ పోస్టులు భర్తీ చే యాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందుకోసం రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నుంచి ఈనెల 15న సర్క్యులర్ జారీ చేసింది. దశలవారీగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని అందులో పేర్కొంది. మొదటిదశలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అంగన్‌వాడీ టీచర్లు, గిరిజన ప్రాంతాల్లోని హెల్పర్లనూ భర్తీ చేయాలని సూచించింది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ (ఐటీడీఏ ప్రాంతాలను మినహాయించి)ల పరిధిలో సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా జిల్లా సంక్షేమాధికారి, సభ్యులుగా ఆర్డీవో, డీఎంహెచ్‌వో లేనిపక్షంలో అడిషనల్ డీఎంహెచ్‌లను నియమించింది. ఇక ఐటీడీఏ ప్రాంతాల్లో కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా సంక్షేమాధికారి మెంబర్ కన్వీనర్‌గా, ఐటీడీఏ పీవో, సంబంధిత ఆర్డీవో, డీఎంహెచ్‌వో లేనిపక్షంలో అడిషనల్ డీఎంహెచ్‌వో సభ్యులుగా ఉండనున్నారు. కాగా, ఇంటర్మీడియెట్ విద్యార్హత ఆధారంగా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మిల్కా తెలిపారు. ప్రభుత్వం గైడ్‌లైన్స్ జారీ చేసిందని, నోటిఫికేషన్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.


