5 లక్షల ఎకరాల్లో.. | - | Sakshi
Sakshi News home page

5 లక్షల ఎకరాల్లో..

Jun 19 2026 2:00 AM | Updated on Jun 19 2026 2:00 AM

● ఈ నెల 8న ఇచ్చోడ మండలంలోని దాబా(బి) గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నకిలీ విత్తనాలు అమ్ముతుండగా పోలీసులు 58 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఇచ్చోడలోని సాయినగర్‌కు చెందిన మరో వ్యక్తి వంద ప్యాకెట్లు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. వీరిని రిమాండ్‌కు తరలించారు. ● గత సోమవారం నకిలీ పత్తి విత్తనాల అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్‌ టూటౌన్‌ పోలీసులు పట్టుకున్నారు. తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. 792 పింక్‌బాండ్‌ నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.9.5 లక్షల విలువ చేసే కాలం చెల్లిన మందులు, విత్తనాలను సీజ్‌ చేశారు. ● ఏప్రిల్‌లో బేల మండలంలోని సాంగిడిలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న గుజరాత్‌కు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 150 నకిలీ విత్తన ప్యాకెట్లతో పాటు రూ.60వేల నగదు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో జోరుగా దందా మహారాష్ట్ర, గుజరాత్‌ నుంచి ఇక్కడికి వచ్చి మకాం కొరఢా ఝులిపిస్తున్న పోలీసులు ఈ ఏడాది 5 కేసులు నమోదు 1031 ప్యాకెట్లు స్వాధీనం

ఆదిలాబాద్‌టౌన్‌: కాసులకు కక్కుర్తిపడి అక్రమార్కులు రైతులను నట్టేట ముంచేందుకు నకిలీ దందా కొనసాగిస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠా జిల్లాలో ఈ దందాను జోరుగా సాగిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్‌, తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మకాం వేసి కొంతమంది డీలర్లతో సత్సంబంధాలు ఏర్పర్చుకొని వారితో మిలాఖత్‌ అయ్యారు. తక్కువ ధరకే విత్తనాలు ఉన్నాయని, అధిక దిగుబడి వస్తుందని ఆశచూసి రైతులకు అంటగడుతున్నారు. ఆ విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకెత్తినా కాత రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా పోలీసులు ఇలాంటి కేటుగాళ్ల ఆటపట్టిస్తున్నారు. ఈ ఏడాది 5 కేసులు నమోదు చేసి పలువురిని రిమాండ్‌కు తరలించినప్పటికీ ఇంకా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు.

మేలు రకం అంటూ..

తమ కంపెనీ విత్తనాలు మేలు రకమైనవని, అధిక దిగుబడులు వస్తాయని అన్నదాతలను నమ్మిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలను టార్గెట్‌ చేశారు. బ్రాండెడ్‌ గల బీటీ విత్తనాల పేర్లలోని ఒక్కో అక్షరాన్ని అటుఇటూ చేస్తూ, అలాంటి కవర్‌ ప్రింట్‌తో అదే మాదిరి పలికే పేర్లతో బ్రాండ్లు తయారు చేస్తున్నారు. నకిలీలను పసిగట్టని రైతులు వాటిని కొనుగోలు చేసి మోసపోతున్న ఘటనలు అనేకంగా చోటు చేసుకుంటున్నాయి.

బీటీ డిమాండ్‌ పెరగడంతో..

కొన్నేళ్లుగా బీటీ రకం విత్తనాల డిమాండ్‌ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. దీంతోపాటు బీటీ–3, లూజ్‌ విత్తనాలు అమ్ముతున్నారు. చీడపీడల ఉధృతి తగ్గడంతో రైతులు వీటిపైనే ఆధారపడటం, కొన్ని కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించడంతో ఈ నకిలీలకు అనుకూలంగా మారుతోంది. గతంలో పంట ఏపుగా పెరిగినా దిగుబడి రాక చాలా మంది రైతులు నష్టపోయిన ఘటనలు లేకపోలేదు. ఈ ఏడాది బేలలో మొదటిసారి 150 ప్యాకెట్లు, రెండోసారి 81, ఇచ్చోడలో 58 ప్యాకెట్లు, ఆదిలాబాద్‌లో 742, మొత్తం 1031 ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో 5 లక్షల 91వేల సాధారణ సాగు విస్తీర్ణం ఉంది. అత్యధికంగా రైతులు పత్తి పంటను సాగు చేస్తారు. 4 లక్షల 30వేల ఎకరాల్లో పత్తి, 90 వేల ఎకరాల్లో సోయా, 50వేల ఎకరాల్లో కందులు, 25వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగవుతున్నాయి. అయితే రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా పత్తి సాగవుతుండడంతో కేటుగాళ్లు జిల్లాపై దృష్టి పెట్టారు. ఏటా ఖరీఫ్‌ సాగుకు ముందు పల్లెల్లో తిరగడం, కంపెనీల ప్రచారం చేపట్టడం, గ్రామాల్లోని పేరున్న రైతులకు విత్తనాలను ఉచితంగా అందించడం వంటివి చేస్తున్నారు. గిఫ్టులు, ఆఫర్లతో మభ్య పెడుతూ విత్తనాలు కొనుగోలు చేసేలా ఆకర్షిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement