అటవీ సాగుదారులు, అధికారుల మధ్య ఘర్షణలు ఏటా వానాకాలంలో ఆక్రమణలపై సిబ్బంది దృష్టి తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో తిరుగుబాట్లు పలు చోట్ల పరస్పరం దాడులు, కేసులతో ఉద్రిక్తతలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అటవీ భూముల సాగుదారులు, అధికారుల మధ్య పోడు రగడ రగులుతూనే ఉంది. ఏళ్లుగా ఏటా వానాకాలంలో విత్తనాలు వేసే వేళ అటవీ సిబ్బంది, ఆక్రమణదారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల పరిస్థితులు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఇక వర్షాలు మొదలైతే గొడవలు మరింతగా జరిగే ఆస్కారం ఉంది. అటవీ ఆక్రమణలపై ఏళ్లుగా శాశ్వత పరిష్కారం లేక సమస్య జఠిలంగా మారుతోంది.
ఆక్రమణ భూములు స్వాధీనం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక లక్ష ఎకరాలకు పైనే అటవీ భూములు సాగులో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో మూడేళ్లుగా పోడు పట్టాలు ఇవ్వని చోట్ల తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తుండగా ఘర్షణలు జరుగుతున్నాయి. మొదట గిరిజనేతరులకు ఐదు ఎకరాల కంటే అధికంగా సాగులో ఉన్నవారి భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే కందకాలు తవ్వడం, మొక్కలు నాటడం, సాగుదారులను భూమి వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలోనే 50వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. పులుల రాకపోకల కోసం తడోబా నుంచి కవ్వాల్ వచ్చేలా 1492 చ.కి.మీ. కారిడార్‌గా గుర్తిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. అయితే అటవీ సమీప ప్రాంత వాసులపై మరింత ఆంక్షలు అమలు కావడంపై తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల తాత్కాలికంగా నిలుపుదల చేశారు. పత్తి సాగు ఆరంభంతో చెట్లు నరికి సాగు చేయడం పెరిగిపోయినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. పోడు రైతులు వెదురు, పండ్ల తోటలు, ఇతర ఆహార ధాన్యాల సాగే చేయాల్సి ఉంది. పూర్తి వాణిజ్య పంట పత్తిపైనే అధికంగా ఆధారపడుతున్నారు.
పట్టాలిచ్చినా.. ఆగని పోరు
గత సర్కారు జీవో 140 ప్రకారం పోడు చేస్తు న్న గ్రామాలను గుర్తించింది. ఆ గ్రామాల్లో నే పోడు కమిటీలను ఏర్పాటు చేసి, దరఖాస్తులు స్వీకరించి, గ్రామ, మండల, డివిజన్, జి ల్లా, రాష్ట్ర స్థాయిలో పరిశీలన తర్వాత పట్టాలు జారీ చేసింది. ఇక గిరిజనుల్లోనూ అర్హులైన వారిని ఎంపిక చేసి 2023 జూన్‌లో పోడు పట్టాలు మంజూరు చేశారు. ఆ సమయంలో చాలామంది తమకు పట్టాలు రాలేదని మళ్లీ అర్జీలు ఇచ్చారు. ప్రధాన నిబంధనల్లో గిరిజ నులను 2005 వరకు, గిరిజనేతరులను 1930 కంటే ముందు సాగులో ఉన్నట్లుగా లేదా మూడు తరాల వారు ఆ భూమిని అనుభవిస్తున్నట్లుగా రుజువులు చూపించాల్సి రావడంతో అర్జీలు తిరస్కరణకు గురయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 33వేల మంది గిరిజనుల చేతిలో 1.24 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు 32వేల మంది గిరిజనేతరుల చేతిలో 1.02లక్షల ఎకరాలు సాగులో ఉన్నట్లు అర్జీలు వచ్చాయి. అయితే గిరిజనేతరులు చట్టం ప్రకారం అనర్హలు కావడంతో వాటిని తిరస్కరించారు. అయినప్పటికీ తమకు పట్టాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల పట్టాలపై రాజకీయ కారణాలతో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి.
నిత్యం ఘర్షణలే..
ఉమ్మడి జిల్లాలో ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, కాగజ్‌నగర్, పెంచికల్‌పేట, చింతలమానేపల్లి, బెజ్జూరు, ఆదిలాబాద్, మావల, నేరడిగొండ, ఇచ్చోడ, బోథ్, సోనాల, కడెం, ఉట్నూరు, జన్నారం, దండేపల్లి, వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో అటవీ అక్రమాలపై నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఫారెస్టు సిబ్బంది, సాగుదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పరస్పరం దూషణలు, ఎదురుదాడులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సార్లు పోలీసు బందోబస్తుతో అటవీ అధికారులు సాగు ఆక్రమణలను తొలగిస్తున్నారు. దండేపల్లి మండలం కోయపోచగూడ, ఇటీవల చింతలమానేపల్లి మండలం దిందా, కడెం మండలం గొండుగూడ, కెరమెరి మండలం సుర్దాపూర్, ఆదిలాబాద్ రూరల్ మండలం అల్లికోరి పరిధిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అటవీ అధికారులు సాగుదారులపై కేసులు సైతం నమోదు చేశారు. అయితే అర్హులైన వారిని గుర్తించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి.


