బోథ్: ఆయిల్ పామ్ సాగుపై జిల్లా రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. సంప్రదాయ పంటల కంటే దీర్ఘకాలికంగా స్థిరమైన రాబడినిచ్చే ఈ వాణిజ్య పంట వైపు స్థానిక రైతులు క్రమంగా అడుగులు వేస్తున్నారు. దీనికి తోడు బహిరంగ మార్కెట్లో ఆయిల్ పామ్ గెలల ధరలు గణనీయంగా పెరగడం, తోటల విస్తీర్ణం, దిగుబడి రోజురోజుకూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుండడంతో పంటను సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన ధరతో రైతుల్లో ఆనందం
ఇటీవల కాలంలో మార్కెట్‌లో ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు ఏకంగా రూ.23,500 కు పెరిగింది. ఈ పెరుగుదల సాగుదారులకు పెద్ద ఊరటగా మా రింది. అంతకుముందు టన్నుకు రూ.21,546 ధర ఉండగా ఇటీవల అదనంగా రూ.1,954 పెరగడంతో రైతులకు ఆర్థికంగా భారీ లాభం చేకూరనుంది.
జిల్లాలో సాగు ఇలా..
జిల్లా ఉద్యానవన శాఖ తాజా గణాంకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో మొత్తం 1,009 మంది రైతులు 2,960 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. ప్రస్తుతం పంట దిగుబడి వస్తుండడంతో కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 135 మంది రైతుల వద్ద నుంచి తగిన మద్దతు ధర చెల్లించి 410 టన్నుల తాజా గెలలు సేకరించారు. ఈ ధరల పెరుగుదలతో పాటు మెరుగైన ఉత్పాదకత కారణంగా రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీటి వనరులు ఉన్న రైతులు ఇతర పంటల కంటే తక్కువ నష్టభయం ఉండి, ఏటా స్థిరమైన ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ తోటల వైపే మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ పామ్ ఆయిల్‌కు డిమాండ్ పెరగడం, ప్రభుత్వం ఉచితంగా మొక్కల సరఫరా, సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ వంటి ప్రోత్సాహకాలు అందించడం కూడా ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
ఆయిల్ పామ్ సాగు : 2,960 ఎకరాలు
సాగు చేస్తున్న రైతుల సంఖ్య : 1009
ఇప్పటి వరకు సేకరించిన గెలలు : 410 టన్నులు
విక్రయించిన రైతుల సంఖ్య : 135
ప్రస్తుతం గెలల ధర టన్నుకు : రూ.23,500
జిల్లా వివరాలు


