కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు.. రెగ్యులర్ ఉద్యోగులతో కలిపి జాప్యం జరిగితే బాధ్యులైన అధికారులపై చర్యలు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి,ఆదిలాబాద్: కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తదిత ర ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్ ఉద్యోగులతో కలిపి వారికి కూడా సకాలంలో చెల్లించాలని సూచించింది. ఈ నెల 9న ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అన్ని ప్రభు త్వ శాఖలు, సంస్థలకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. జూలై నుంచి పకడ్బందీగా అమలు చేయనున్నారు. జిల్లాలో రెగ్యులర్ ఉద్యోగులు 9వేల వరకు ఉండగా, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 2500 వరకు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతినెలా 1న గతనెలకు సంబంధించిన జీతాలను అన్నివర్గాల ఉద్యోగులకు చెల్లించాలి. ప్రస్తుతం అదేవిధంగా విడుదల అవుతున్నప్పటికీ వివిధ కారణాలతో ఆలస్యం జరుగుతుందనే అభిప్రాయం ఉంది. పేబిల్లుల ఆలస్యం, హాజరు నమోదు, తనిఖీలు, ఆడిట్, బిల్లుల ఆమోదంలో జాప్యం వంటి కారణాలతో ఉద్యోగులకు సకాలంలో జీతాలు, వేతనాలు అందని పరిస్థితి ఉంది. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆలస్యమైతే బాధ్యులపై చర్యలు..
రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, గౌరవ వేతనంపై పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి జీతాలు, వేతనాలు ఆలస్యం కాకుండా చెల్లించా లని, జాప్యానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతినెలా గతనెల 21వ తేదీ నుంచి ప్రస్తుత నెల 20వ తేదీ వరకు హాజరును పరిగణించాలని పేర్కొంది. 25న ట్రెజరీ విభాగానికి సంబంధిత శాఖలు బిల్లులు సమర్పించాలని ఆదేశించింది. నెల చివరి పనిదినం లోపు బిల్లుల పరిశీలన, ఆడిట్, ఆమోద ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో సకాలంలో జమయ్యేలా ట్రెజరీ అధికారులు బాధ్యత వహించాలని పేర్కొంది. సంబంధిత శాఖల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (డీడీవో)లకు తగిన బడ్జెట్ కేటాయింపు, అవసరమైన పరిపాలన, ఆర్థిక అనుమతులు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించింది. శాఖాధిపతులు ఈ విషయంలో పర్యవేక్షణ చేయాలనిస్పష్టం చేసింది. ఆలస్యమైతే సంబంధి త అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.


