ఆదిలాబాద్‌టౌన్: యోగాతో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని, ప్రతిఒక్కరూ యోగా సాధనను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష పిలుపునిచ్చారు. గురువారం రిమ్స్‌లో యోగా అవగాహన వాక్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలకు యోగా సాధన సమర్థవంతమైన పరిష్కార మార్గమన్నారు. నిత్యం యోగా, వాకింగ్ అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారం, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, వైద్యుల సూచనలు పాటిస్తూ ప్రతిరోజూ యోగాసనాలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ సాధన, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్, యోగా డే నోడల్ అధికారి డాక్టర్ కస్తాల చంద్రశేఖర్, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ ప్రీతల్ రాథోడ్, డిప్యూటీ నోడల్ అధికారులు డాక్టర్ శ్రీకాంత్, అయూష్ వైద్యురాళ్లు మౌనిక, సబోహి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి, ఆయూష్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


