కై లాస్‌నగర్: జిల్లాలో గృహ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల అనుమతులు, నిర్మాణాల పురోగతి, డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు, మౌలిక వసతుల కల్పనపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మావల, కేఆర్‌కే కాలనీలోని డబుల్ బెడ్‌రూం ఇళ్లకు అవసరమైన మౌలిక వసతులు, పెండింగ్ పనులు జూలై 15 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అనుమతుల విషయంలో గుడిసెల్లో నివసిస్తున్న వారికి తొలి ప్రాధాన్యం కల్పించాలని, దీనికి సంబంధించిన నివేదికలు త్వరితగతిన సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, జెడ్పీ సీఈవో రవి, హౌసింగ్ పీడీ శంకర్, ము న్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


