హెచ్‌ఎంల మధ్య అంతర్గత పోరు | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎంల మధ్య అంతర్గత పోరు

Jun 5 2026 11:47 PM | Updated on Jun 5 2026 11:47 PM

ఎంఈవో పోస్టు కోసం ఓ ప్రధానోపాధ్యాయుడి ఒత్తిడి సామగ్రి, నిధుల బదిలీకి మరో హెచ్‌ఎం ససేమిరా స్కూళ్లు తమ పరిధిలోకే వస్తాయని లొల్లి ఎటూ తేల్చలేకపోతున్న విద్యాశాఖాధికారులు

ఆదిలాబాద్‌టౌన్‌: ఇద్దరు ప్రధానోపాధ్యాయుల వివాదం ఏడాదిగా విద్యాశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. త్వరలో పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, ఈ విషయాన్ని ఎటూ తేల్చలేకపోతున్నారు. కొత్త మండలాలు ఏర్పడినప్పుడు మావలను మండలంగా ఏర్పాటు చేశారు. గతంలో ఆదిలాబాద్‌అర్బన్‌ ఎంఈవో ఈ మండలాన్ని పర్యవేక్షించారు. రెండేళ్ల క్రితం మావలకు ప్రత్యేక ఎంఈవో పోస్టు ఇన్‌చార్జీతో భర్తీ చేశారు. గతంలో ఎంఎన్‌వోలుగా పనిచేసిన వారికే ఎంఈవోలుగా బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉంటే మావల మండలానికి స్కూల్‌ కాంప్లెక్స్‌ లేదు. ఇదివరకు సరస్వతినగర్‌ పాఠశాల పరిధిలోకి ఈ పాఠశాలలు వచ్చేవి. గతేడాది సమగ్ర శిక్షా ఎస్పీడీ చించుఘాట్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ను మావలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిప్రకారం మావల పరిధిలోకి వచ్చే ఏడు స్కూళ్లను సరస్వతినగర్‌ నుంచి తొలగించాల్సి ఉంటుంది. కానీ ఓ హెచ్‌ఎం ఆ పాఠశాలలు తమ పరిధిలోకే వస్తాయని రికార్డులు అప్పగించడం లేదని సమాచారం. మావల మండలంలోనే సరస్వతినగర్‌ పాఠశాల ఉందని, తానే సీనియర్‌ కావడంతో ఎంఈవోగా నియమించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ వివాదం కలెక్టర్‌తోపాటు ఆర్‌జేడీ, డీఈవో వరకు వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు.

స్కూళ్లు మావంటే.. మావే..

సరస్వతినగర్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ ఆదిలాబాద్‌ అర్బన్‌ మండల పరిధిలోకి వస్తుంది. అయితే రెవెన్యూ పరంగా చూస్తే మావల మండలంలో ఉంది. ప్రస్తుతం ఈ పాఠశాల పర్యవేక్షణ ఆదిలాబాద్‌అర్బన్‌ ఎంఈవో చూస్తున్నారు. సరస్వతినగర్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలో 15 పాఠశాలలు ఉండగా, మావల మండల పరిధిలో ఏడు పాఠశాలలు ఉన్నాయి. వాటిని సరస్వతినగర్‌ కాంప్లెక్స్‌లోనే కొనసాగించాలని ఓ హెచ్‌ఎం అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మావల మండల పరిధిలో ఏడు పాఠశాలలు ఉండగా, ఈ పాఠశాలలు తమ పరిధిలోకే వస్తాయని మావల ప్రస్తుత ఎంఈవో పేర్కొంటున్నారు. కాగా సమగ్రశిక్షా నుంచి చించుఘాట్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ను మావలకు కేటాయిస్తూ గతేడాది ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో విద్యాశాఖ అధికారులు కంప్యూటర్‌, ప్రింటర్‌, నిధులను మావలకు కేటాయించాలని చించుఘాట్‌ హెచ్‌ఎంకు ఆదేశాలు జారీ చేసినా సదరు హెచ్‌ఎం పట్టించుకోవడం లేదని విద్యాశాఖ ఉద్యోగులు చెబుతున్నారు. అదేవిధంగా సరస్వతి స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని ఏడు పాఠశాలల రికార్డులను మావలకు అప్పగించాల్సి ఉంది. కానీ ఆ రికార్డులను మాత్రం సదరు హెచ్‌ఎం అప్పగించడం లేదు.

విద్యార్థులకు నష్టం..

కొత్తగా ఏర్పడ్డ మావల మండలంలో మూడు గ్రామాలు ఉన్నాయి. ఇతర మండల స్థాయి అధికారులను కేటాయించిన ప్రభుత్వం ఎంఈవోను సైతం నియమించింది. ప్రస్తుతం ఆదిలాబాద్‌అర్బన్‌ పరిధిలో ఉన్న సరస్వతినగర్‌ను మావలలో కలపడంతో మండల పరిధిలోని విద్యార్థులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. మౌలిక వసతులు, ఇతర వనరులు, పాఠశాలకు కేటాయించే నిధులు నష్టపోవాల్సి వస్తుందని మండల పరిధిలోని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మావల మండలానికి ప్రత్యేక స్కూల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. ఈ విషయమై జిల్లా విద్యా శాఖాధికారి డి.మాధవిని విరణ కోరగా, ఈ విషయాన్ని ఆర్‌జేడీ దృష్టికి తీసుకెళ్లామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement