అమల్లోకి సవరించిన ధరలు | - | Sakshi
Sakshi News home page

అమల్లోకి సవరించిన ధరలు

Jun 5 2026 11:47 PM | Updated on Jun 5 2026 11:47 PM

పట్టణంలో ప్లాట్‌కు అత్యధికంగా రూ.30,400 పెంపు అత్యల్పంగా స్క్వేర్‌యార్డ్‌కు రూ.2400 వ్యవసాయ భూములకు ఎకరానికి రూ. 5లక్షల నుంచి రూ.13 కోట్లు కొనుగోలుదారులపై అదనపు భారం

కై లాస్‌నగర్‌: రాష్ట్ర ప్రభుత్వం సవరించిన భూముల ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్స్‌ ధరలను ప్రాంతాల వారీగా డిమాండ్‌కు అనుగుణంగా సవరించారు. ప్లాట్ల ధరలు 15 శాతం నుంచి 25 శాతం పెంచగా, వ్యవసాయ భూములను 20 శాతం నుంచి 100శాతం పెంపుదల చేశారు. నూతన ధరలను పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌ అర్బన్‌లో అత్యఽధికంగా భూముల ధరలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో 20శాతం పెంచగా, మండల కేంద్రాలు, డిమాండ్‌ ఎక్కువగా ఉన్న మేజర్‌ గ్రామ పంచాయతీల్లో 50శాతం నుంచి 75శాతం ధరలు పెరిగాయి. దీంతో ప్లాట్ల కొనుగోలు దారులపై స్వల్పంగా భారం పడగా, వ్యవసాయ భూముల ధరలకు మాత్రం రెక్కలు వచ్చాయి. వాటి కొనుగోలు కొంత భారంగా మారనుంది. వీటి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరే అవకాశముంది.

ఆదిలాబాద్‌ పట్టణంలో ఇలా..

ఆదిలాబాద్‌ పట్టణంలో ప్లాట్ల ధరలు స్వల్పంగా పెరిగాయి. గంజ్‌రోడ్‌, అంబేడ్కర్‌చౌక్‌, శివాజీచౌక్‌, రైల్వే స్టేషన్‌ రోడ్‌, బస్టాండ్‌డౌనల్‌ వంటి ప్రాంతాల్లో గతంలో స్వ్కేర్‌యార్డ్‌కు రూ.26,400 అత్యధికంగా ఉండగా ప్రస్తుతం దాన్ని రూ.30,400కు పెంచారు. పట్టణంలో ఏరియా, అక్కడి డిమాండ్‌కనుగుణంగా ధరలు పెంచారు. పంజేషాకాలనీలో చదరపు అడుగుకు రూ.13,200 ఉండగా దాన్ని రూ.15వేలకు పెంచారు. అత్యల్పంగా ఖానాపూర్‌, ధన్‌గర్‌గల్లి, మసూద్‌చౌక్‌, స్వీపర్స్‌కాలనీ, బొక్కల్‌గూడ కాలనీల్లో గతంలో రూ.2400 ఉండగా ప్రస్తుతం రూ.2800కు చేరింది. అశోక్‌రోడ్‌, కోలిపూర, బ్రహ్మణ్‌వాడల్లో రూ.5800 నుంచి రూ.6700కు పెంచారు. ప్రస్తుతం ప్లాట్ల క్రయవిక్రయాలు ఎక్కువగా జరగడంతో పాటు భారీ ధర పలుకుతున్న దస్నాపూర్‌, రాంనగర్‌, మణిపూర్‌ వంటి ప్రాంతాల్లో మార్కెట్‌ వ్యాల్యూను మురికివాడలైన గాంధీనగర్‌, రణదీవేనగర్‌ కాలనీలకంటే తక్కువగా నిర్ణయించడంపై విమర్శలు విన్పిస్తున్నాయి. కాగా గ్రామీణ ప్రాంతాల్లో స్క్వేర్‌యార్డ్‌కు రూ.600లు ఉన్న ధర రూ. 700లు కాగా, రూ.900లు ఉన్న ధర రూ.1100లకు పెంచారు. ఆయా ప్రాంతాల్లో ప్లాట్ల కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ చార్జీలు భారంగా మారనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భారీగా పెరిగిన వ్యవసాయ భూముల ధరలు..

ఓపెన్‌ ప్లాట్ల కంటే వ్యవసాయ భూముల ధరలు జిల్లాలో భారీగా పెరిగాయి. 20శాతం నుంచి 100శాతం పెంచడంతో మార్కెట్‌ వ్యాల్యూ అధికమైంది. ఆదిలాబాద్‌ పట్టణంలోని సర్వే నంబర్‌ 400లో మొన్నటి వరకు రూ.11కోట్ల విలువ కలిగిన ఎకరం వ్యవసాయ భూమి రూ.13 కోట్లకు చేరింది. అదనంగా రూ.2 కోట్లు పెరిగాయి. ఖానాపూర్‌, భూక్తాపూర్‌ శివారులోని పలు సర్వే నంబర్లలో గల వ్యవసాయ భూములు ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.31 లక్షలకు పెరిగాయి. రియల్‌ ఎస్టేట్‌లో దూసుకుపోతున్న మావల మండల కేంద్రంలోని పలు వ్యవసాయ భూముల విలువను రూ.1.95 కోట్లకు పెంచారు. నేరడిగొండ మండలం నేరడిగొండ –జి గ్రామ పంచాయతీ పరిధిలో ఎకరం వ్యవసాయ భూమి ధర రూ.2.50లక్షలు ఉండగా రూ.6లక్షలకు పెరిగింది. సిరికొండ మండలం పొన్న గ్రామంలో రూ.3,37,500 ఉండగా రూ.8లక్షలకు చేరింది. సుంకిడి గ్రామంలో రూ.3,37,500లు ఉండగా రూ.15లక్షలకు పెరిగింది. మిగతా మండలాల్లోని గ్రామాలు, మండల కేంద్రాలు, మేజర్‌ గ్రామ పంచాయతీల్లో భూముల డిమాండ్‌, రోడ్డు సౌకర్యం, నివాసాలు వంటి వాటి ఆధారంగా 20 నుంచి 100శాతం పెంచినట్లుగా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement