ఆడిటోరియం అటకెక్కినట్టేనా..! | - | Sakshi
Sakshi News home page

ఆడిటోరియం అటకెక్కినట్టేనా..!

Jun 5 2026 11:47 PM | Updated on Jun 5 2026 11:47 PM

● కళారూపాల ప్రదర్శనకు కరువైన వేదిక ● ఆగిపోయిన నిర్మాణ ప్రతిపాదన ● కళాకారులకు కానరాని ప్రోత్సాహం

ఆదిలాబాద్‌: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన జిల్లాలో కళాకారులకు కొదవ లేదు. గుస్సాడీ మొదలుకొని బంజారా, జానపదం, వెస్ట్రన్‌, సంప్రదాయ నృత్యరీతుల్లోనూ ఎంతోమంది ప్రతిభ చాటుతున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన కళాకారులెందరో ఉన్నా రు. అయితే తమ కళను ప్రదర్శించడానికి జిల్లాలో ఎటువంటి వేదిక లేకపోవడం కళాకారులకు శాపంగా మారింది. గతంలో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆడిటోరియం నిర్మించాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ అది సైతం అటకెక్కినట్లే కనిపిస్తోంది.

కళాభివృద్ధికి వేదికగా..

ఆడిటోరియం నిర్మాణం జరిగితే ఎంతోమంది కళాకారులు తమ కళను ప్రదర్శించే అవకాశం కలుగుతుంది. తక్కువ ఖర్చుతో కళా ప్రదర్శనలు ఇవ్వొచ్చు. ఆడిటోరియం అందుబాటులో ఉండి ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేస్తే కళాకారులు ఆదాయం కూడా పొందవచ్చు. అదే సమయంలో జిల్లా ప్రజలకు ఈ కళా ప్రదర్శనలు చూసే అవకాశం కలుగుతుంది. ఆడిటోరియం వేదికపై ప్రదర్శన ఇవ్వడం వల్ల కళాకారులకు సమాజంలో మంచి గుర్తింపు రావడమే కాకుండా, రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై సత్తా చాటే అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్‌ గదులు ఏర్పాటు ద్వారా కళాకారులు ప్రదర్శనలను మ రింతగా మెరుగుపరుచుకోవచ్చు. ఆడిటోరియంలో అధికారిక కార్యక్రమాలు సైతం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. స్థానిక నృత్యరీతులైన గుస్సాడీ, బంజారా నృత్యాల ప్రదర్శనతో వాటిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావచ్చు.

యువజనోత్సవాలకు మంగళం..

యువత ప్రతిభను వెలికి తీసేందుకు ఏటా యువజనోత్సవాలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సరైన వేదిక లేకపోవడంతో వాటి నిర్వహణలో సైతం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తూతూ మంత్రంగా నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఎంతోమంది ప్రతిభగల యువ కళాకారులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

గతంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్‌ ప్రాంగణంలో ఆడిటోరియం నిర్మించాలని భావించారు. అయితే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని తమకే ఆ స్థలం కావాలని కళాశాల యాజమాన్యం నిరాకరించడంతో స్థలం కరువైంది. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి ఆడిటోరియం నిర్మాణమయ్యేలా కృషి చేయాలని కళాకారులు

కోరుతున్నారు.

డిగ్రీ కళాశాలలో..

కళలకు నెలవైనా..

జిల్లాలో గిరిజనుల ప్రాభల్యం అధికంగా ఉంటుంది. వారి సంస్కృతి, సంప్రదాయాలు ఎంత భిన్నంగా ఉంటాయో వారి కళలు కూడా వైవిధ్యంతో నిండి ఉంటాయి. ఆదివాసీల గుస్సాడీ నృత్యం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ప్రముఖ గుస్సాడీ కళాకారుడు పద్మశ్రీ కనకరాజు గుస్సాడీ ఖ్యాతిని ఢిల్లీ వరకు చేర్చారు. మరోవైపు బంజారాల నృత్యాలు వాటికవే ప్రత్యేకంగా ఉన్నాయి. ఎన్నో భిన్నమైన నృత్యరీతులకు జిల్లా నెలవైనప్పటికీ వాటిని ప్రదర్శించేందుకు వేదికలు కరువయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement