రెండోరోజూ.. అదే తీరు | - | Sakshi
Sakshi News home page

రెండోరోజూ.. అదే తీరు

Apr 24 2026 6:08 AM | Updated on Apr 24 2026 6:08 AM

● పట్టు వీడని ఆర్టీసీ కార్మికులు ● అరకొరగా నడిచిన బస్సులు ● ఇబ్బంది పడ్డ ప్రయాణికులు

ఆదిలాబాద్‌: ఆర్టీసీ కార్మికులు సమ్మె విషయంలో ప ట్టు వీడకపోవడంతో రెండోరోజూ బస్సులు నిలిచి పోయాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కూడా కార్మికుల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్‌ డిపో ఎదుట, పట్టణంలోని కుమురం భీమ్‌ చౌక్‌లో ఆందోళన నిర్వహించి కుమురంభీం విగ్రహానికి వినతిపత్రం అందించారు. తమ ఎంప్లాయ్‌ ఐడీలపై టికెట్లు జారీ చేస్తూ తామంతా విధుల్లో ఉంటున్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తంజేశారు. తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోకుండా తమకు వ్యతిరేకంగా ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ మాజీ కన్వీనర్‌ సుభాష్‌ రాథోడ్‌, జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు సంఘీభావం ప్రకటించారు. కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

వెల్ఫేర్‌ బోర్డు మెంబర్‌ పదవులకు

ఇద్దరు కార్మికుల రాజీనామా

వెల్ఫేర్‌ బోర్డు మెంబర్లుగా గతంలో నియమితులైన ఇద్దరు ఆర్టీసీ కార్మికులు రాజీనామా చేశారు. కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కె.ప్రమిళ, డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న సాయిబాబా గురువారం రా జీనామా లేఖను సంస్థ ఉన్నతాధికారులకు అందజేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చేదాకా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రయాణికులకు తప్పని పాట్లు

ప్రయాణికుల సౌకర్యార్థం అధికారులు కొన్ని బస్సులు నడిపినా వారికి అవస్థలు తప్పలేదు. మరోవైపు వేసవి సెలవులు ప్రకటించడంతో విద్యాసంస్థలు, వసతిగృహాల నుంచి విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఇదే అదనుగా ప్రైవేట్‌ వాహనదారులు రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి లబ్ధిదారుల కన్నా టికెట్‌ తీసుకున్న వారికే ప్రాధాన్యం ఇవ్వడంతో మహిళల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం జాఫ్రాపూర్‌ గ్రామానికి చెందిన భానుశ్రియా అనుకుంటా గ్రామంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల పాఠశాలలో ఐదోతరగతి చదువుతుండగా వేసవి సెలవులు ప్రకటించడంతో ఆమె తండ్రి రమేశ్‌ బైక్‌పై 95 కిలోమీటర్లు ప్రయాణించి చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ ఘటనతో క్షేత్రస్థాయిలో సమ్మె ప్రభావం ప్రయాణికులపై ఏ మేరకు పడుతుందో తెలుసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement