కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ పదవుల ఎంపిక వ్యవహారం ఉత్కంఠను రేకిత్తిస్తోంది. మొత్తం నాలుగు పదవులను భర్తీ చేయనుండగా అవి కూటమిలోని ఏ పార్టీకి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు కూటమిగా ఏర్పడ్డ బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం తిరిగి కో ఆప్షన్ పదవులు ద క్కించుకోవాలని ప్రయత్నిస్తుండటం రాజకీయంగా వేడిని రాజేస్తోంది. ప్రధానంగా చైరపర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన బీఆర్‌ఎస్ నాలుగు కో ఆప్షన్ పదవులు తమకే కావాలంటూ పట్టుబడుతోంది. కాగా, తమకూ కా వాల్సిందేనని ఎంఐఎం, కాంగ్రెస్ అడుగుతుండటంతో ఈ పదవులు ఏ పార్టీకి దక్కుతాయనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సమీపిస్తున్న గడువు
గ్రేడ్–1 స్థాయి కలిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో నాలుగు కో ఆప్షన్ మెంబర్ల పదవులు భర్తీ చేసేందుకు అవకాశముంది. ఇందులో రెండు జనరల్ వి భాగంలో, మరో రెండు మైనార్టీలకు కేటాయించా రు. వీటి ఎంపికకు ఈ నెల 17వ తేదీన మున్సిపల్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. వారం గడువిచ్చిన అధికారులు ఈ నెల 25న సాయంత్రం ఐదు గంట్లలోపూ అ ర్హులైన వారు దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. ఇందుకు సంబంధించిన గడువు సమీపిస్తుండగా ఇప్పటివరకు ఆయా పార్టీల తరఫున ఎవరినీ ఎంపిక చేయలే దు. మరో రెండ్రోజుల గడువే మిగిలి ఉండటంతో ఈ పదవుల కోసం ఏయే పార్టీల తరఫున దరఖాస్తులు అందజేశారనేది రాజకీయంగా ఉత్కంట రేకిత్తిస్తోంది. కూటమిలోని పార్టీలన్నీ ఈ పదవులు దక్కించుకుంటాయా? లేదా.. ఒకే పార్టీకి నాలుగు పదవులు కేటయిస్తారా? అనేది మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు రాజకీయవర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
అన్నీ తమకేనని బీఆర్‌ఎస్ పట్టు
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులుండగా 21కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుని బీజేపీ బల్ది యాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనికి తో డు ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి ఈ సంఖ్య 23కు చేరింది. అయినప్పటికీ 11 స్థానా లు గెలుచుకున్న కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్, స్వతంత్రుల మద్దతుతో చైర్‌పర్సన్ పదవిని దక్కించుకుంది. ఎంఐఎంకు వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన తమ పార్టీకే నాలుగు కో ఆప్షన్ పదవులు ఇవ్వాలంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పట్టుబడుతున్నట్లు తెలిసింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సహకరించినందున తమకు ఈసా రి సహకరించాలంటూ కూటమిలోని పార్టీలకు ఆయన తేల్చిచెప్పినట్లు చర్చ సాగుతోంది. ఇదే విషయంపై బుధవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడిన జోగు రామన్న దీనిపై కుండబద్దలు కొట్టినట్లు రాజకీయాల్లో చర్చ సాగుతోంది. అయితే, కూటమిలో భాగస్వాములు గా ఉన్న తమకు కో ఆప్షన్ పదవులు కావాలంటూ అధికార కాంగ్రెస్, ఎంఐఎం కూడా అడుగుతున్నాయి. కాంగ్రెస్ రెండు పదవులు ఆశిస్తుండగా ఎంఐఎం ఒక పదవి కోరుకుంటోంది. మరోవైపు ఆయా పార్టీల తరఫున పదవులు ఆఽశిస్తున్న మాజీ కౌన్సిలర్లు తమకే దక్కేలా చూడాలంటూ ఆయా పార్టీల నేతలపై ఒత్తడి తీసుకువస్తున్నారు. ఈసారి ఎలాగైనా అవకాశం కల్పించాలంటూ వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పదవులు ఏ పార్టీకి దక్కుతాయనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు రెండే
దరఖాస్తులు
ఇప్పటివరకు మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ పదవుల కోసం రెండు దరఖాస్తులు మాత్రమే అందాయి. పార్టీ 11వ వార్డు మాజీ కౌన్సిలర్ తుర్పాటి సుజాత, ఖానాపూర్ (అంబేడ్కర్‌నగర్) మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ కో ఆప్షన్ మెంబర్ పదవుల కోసం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేశారు. పార్టీలపరంగా వారికి ఎలాంటి అంగీకారం లేనప్పటికీ దరఖాస్తు చేయ డం ప్రాధాన్యత సంతరించుకుంది.
మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు సంబంధించి బీఆర్‌ఎస్, ఎంఐఎం, స్వతంత్రులను కూడగట్టడంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లా కేంద్రానికి రానున్నారు. పార్టీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలు స్వీకరించే అవకాశముంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పార్టీ ముఖ్య నాయకులతో ఆయన నేరుగా సంప్రదింపులు జరిపే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు పదవుల్లో ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలి.. కాంగ్రెస్‌కు పదవులు దక్కుతాయా.. లేదా? అనేదానిపై చర్చించి నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది.


