ఎక్స్‌అఫీషియోనే కింగ్‌మేకర్!
నిర్మల్‌ఖిల్లా: ఉమ్మడి జిల్లాలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఈనెల 16న చైర్మన్, మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో ఓటు కీలకంగా మారనుంది. పార్టీల సభ్యుల సంఖ్య సమానంగా ఉన్న సందర్భాల్లో వీరి ఓట్లు ఫలితాన్ని తేలుస్తాయి. ఈనేపథ్యంలో ఎక్స్ అఫీషియో ఓటు అంటే, ఎవరు వేయగలరు? దాని ప్రాధాన్యంపై తెలుసుకుందాం.
ఓటు హక్కు–కౌన్సిలర్లతో సమానం
మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లేదా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎక్స్‌అఫీషియో సభ్యులకు వార్డు కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లతో సమాన ఓటు హక్కు ఉంటుంది. ఎన్నిక నిర్వహణకు అవసరమైన కోరం లెక్కింపులో వీరిని పరిగణనలోకి తీసుకుంటారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్పష్టమైన మెజార్టీ రాని సందర్భంలో వీరు కీలకంగా మారుతారు. స్థానిక ఎమ్మెల్యే లేదా ఎంపీ వేసే ఓటు ఏ పార్టీకి అనుకూలిస్తే, ఆ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది.
ఓటు హక్కుపై రాతపూర్వకంగా తెలపాలి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు మొత్తం 11 బల్దియాలకు ఎ న్నికలు జరగగా, కొన్నిచోట్ల స్పష్టమైన మెజార్టీ మార్కును చేరువ కాగా, మరికొన్నిచోట్ల స్వతంత్రుల పాత్ర కీలకంగా మారింది. ఇలాంటి చోట్ల ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుంది. తమ పరిధిలో ఒకటికంటే ఎక్కువ మున్సిపాలిటీలు ఉంటే ఎక్కడ తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారో ముందుగా ఎన్నికల సంఘానికి రా తపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. భైంసా, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులపాత్రపై ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఏం జరుగుతుందో సోమవారం నాటికి తేటతెల్లమవుతుంది.
సభ్యులు ఎవరంటే..
తెలంగాణ మున్సిపల్ చట్టం–2019 ప్రకారం, మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలో ఓటరుగా నమోదైన ప్రజాప్రతినిధులను ఎక్స్‌అఫీషియో సభ్యులుగా పరిగణిస్తారు. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఉంటారు. అయితే తాజాగా ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నికల సమయంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుంది.
పోటీ హక్కు లేదు..ప్రభావం మాత్రం
ఎక్స్‌అఫీషియో సభ్యులు స్వయంగా చైర్మన్ లేదా మేయర్ పదవికి పోటీ చేయలేరు. అయితే ఎన్నికల్లో ఓటేయడం ద్వారా పరోక్షంగా పాలన దిశను నిర్ణయించే శక్తి వారికి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం వచ్చినా వారి ఓటు కీలకంగా మారుతుంది. జిలాల్లో మున్సిపల్ రాజకీయాల్లో చైర్మన్ ఎన్నిక సమీపిస్తున్న కొద్ది పార్టీల మధ్య సమీకరణాలపై చర్చలు వేగం పుంజుకుంటున్నాయి. కౌన్సిలర్ల సంఖ్యతోపాటు వీరి మద్దతు ఎటు ఉంటుందన్నదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. స్పష్టమైన మెజార్టీ లేని పరిస్థితుల్లో వీరి ఓటు ‘కింగ్‌మేకర్’పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


