ఆలయంలో చోరీ
సారంగపూర్: మండలంలోని వంజర్ గ్రామంలోని మహాలక్ష్మీ దేవాలయంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు పగులగొట్టి చొరబడి అమ్మవారి వెండి, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆలయం తెరిచి ఉండడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా, బంగారం పుస్తెలు, ముక్కుపుడుక, వెండి హారం, వడ్డాణం, భక్తులు అమ్మవారికి సమర్పించిన వెండి కళ్లు, తదితర వాటిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. గర్భగుడిలో ఉన్న బీరువా పగులగొట్టి అందులో వెండి వస్తువులతో కలిపి సుమారు రూ.2 లక్షల విలువ గల ఆభరణాలను చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీకాంత్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరా సరిగా పనిచేయకపోవడంతో దొంగలను గుర్తించడం పోలీసులకు సవాలుగానే మారింది. ఘటన స్థలంలో లభించిన దుండగుల వేలిముద్రలు, వారు వదిలివెళ్లిన వస్తువులను సేకరించి వాటి ఆధారంతో కేసు దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై తెలిపారు.


