బతుకు బూడిదైంది
అంతు లేని దుఃఖంతో..
తిరిగి వచ్చేసరికి ఊరంతా బూడిదకుప్పగా కనిపించడంతో గుండెలు బాదుకుంటూ విలపించారు. కొంతమంది రగులుతున్న అగ్గిని ఆర్పేందుకు ప్రయత్నించారు. ఉపయోగపడే సామగ్రి ఏదైనా మిగిలిందేమో.. జాగ్రత్త చేసుకుందామని ఆ సెగల్లోనే వెతికారు. గత ఖరీఫ్‌లో రెక్కలు ముక్కలు చేసుకుని పండించి ఇంట్లో దాచుకున్న ధాన్యం, ఇతర నిత్యావసర వస్తువులు, పండగ ఆనందంగా జరిపేందుకు తెచ్చి ఉంచుకున్న డబ్బులు.. ఆధార్, రేషన్ కార్డులు, కీలకమైన సర్టిఫికెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు.. ఇలా సమస్తం అగ్నికి ఆహుతైపోయాయి. దీంతో, బాధితుల దుఃఖానికి అంతే లేకుండా పోయింది. తమ బతుకు బూడిదైందని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదంలో నష్టం సుమారు 50 లక్షలు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కట్టుబట్టలతో మిగిలిన బాధితులు రాత్రంతా చలికి గజగజా వణుకుతూనే గడిపారు. అధికార యంత్రాంగం టెంట్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి చలిని ఆపలేకపోయాయి. ఆ టెంట్లతో పాటు చుట్టుపక్కల ఉన్న పాకల్లో బాధితులు రాత్రంతా ఉన్నారు. బాధితులకు అధికారులు దుప్పట్లు అందజేసినప్పటికీ అవి అందరికీ చాలని దుస్థితి నెలకొంది.
రౌతులపూడి: మండలంలోని సార్లంక గిరిజన గ్రామస్తులకు ఈ సంక్రాంతి పండగ ఎప్పటికీ మరువలేని విషాదాన్నే మిగిలించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇంట్లో సోమవారం సాయంత్రం రేగిన మంటలు.. క్రమంగా వంట గ్యాస్ సిలిండర్‌కు.. దాని నుంచి మరో సిలిండర్‌కు అంటుకుని.. అవి కాస్తా లీకై పేలిపోవడంతో క్షణాల్లోనే అగ్నికీలలు ఎగసి పడుతూ.. స్వల్ప వ్యవధిలోనే ఊరంతటినీ బూడిద కుప్పగా మార్చేశాయి. సుమారు 150 జనాభా ఉన్న ఈ గ్రామంలో దాదాపు 36 ఇళ్లు ఉన్నాయి. వీటిలో మూడు పక్కా ఇళ్లు మినహా మిగిలిన 33 పూరిళ్లూ ఈ ప్రమాదంలో కాలి బూడిదైపోయాయి. వీటిల్లో 46 కుటుంబాలు నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సంక్రాంతి పండగ సంతోషంగా నిర్వహించుకోవాలనే ఆశతో అందుకు అవసరమైన దుస్తులు, కిరాణా తదితర సామగ్రి కొనుగోలు చేసుకునేందుకు ఆ గ్రామంలోని గిరిజనులు రౌతులపూడి, తుని తదితర ప్రాంతాలకు వెళ్లారు. గ్రామంలో దాదాపు ఎవ్వరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరగడంతో బాధిత కుటుంబాల వారు సర్వం కోల్పోయారు.
అధికారుల పర్యటన
ఆర్డీఓ శ్రీరమణి ఆధ్వర్యాన అధికారులు మంగళవారం గ్రామంలో పర్యటించారు. అగ్నిప్రమాద బాధితులకు పునరావాసం కల్పించారు. తక్షణ సాయంగా ప్రతి కుటుంబానికి బియ్యం, రూ.25 వేల ఆర్థిక సాయాన్ని స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, స్థా చేతుల మీదుగా అందజేశారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ పి.బొజ్జిరెడ్డి కూడా గ్రామంలో పర్యటించారు. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బాధితులకు భోజనం, అల్పాహారం, దుస్తుల వంటివి పంపిణీ చేశారు. గ్రామంలో నిలువ నీడను కోల్పోయిన బాధితులకు ఎవరికి వారు తమవంతు సహకారం అందిస్తున్నారు.
సార్లంక గ్రామంలో కాలి బూడిదవుతున్న ఇళ్లు
అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర సరకులు అందిస్తున్న ముద్రగడ గిరిబాబు
బాధితులను ఓదార్చుతున్న గిరిబాబు
ఫ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన సార్లంక ప్రజలు
ఫ మొత్తం 33 ఇళ్లు దగ్ధం
ఫ 46 కుటుంబాలు నిరాశ్రయం
ఫ సుమారు రూ.50 లక్షల నష్టం
ఫ రాత్రంతా చలిలో
వణుకుతూ గడిపిన బాధితులు
వైఎస్సార్ సీపీ అండ
సార్లంక అగ్ని ప్రమాదంలో నిలువనీడ కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన బాధితులకువైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అండగా నిలిచారు. మంగళవారం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఇళ్లు కోల్పోయిన 46 బాధిత కుటుంబాలకు తక్షణ సహాయంగా 25 కిలోల బియ్యం, నిత్యావసర సరకులు, చీరలు, లుంగీలు, టీ షర్టులు, దుప్పట్లు, తువ్వాళ్లు తదితర సామగ్రి, అల్పాహారం అందజేశారు. ఈ కష్టం నుంచి తేరుకునేంత వరకూ బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఇళ్లు కోల్పోయిన వారందరికీ వెంటనే పక్కా ఇల్లు నిర్మించి, పునరావాసం కల్పించాలని, రూ.2 లక్షల పరిహారం అందించాలని గిరిబాబు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు, జెడ్పీటీసీ సభ్యుడు గొల్లు చినదివాణం, పార్టీ అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంగూరి లక్ష్మీ శివకుమారి, పార్టీ నాయుకులు అడపా సోమేష్, గుడాల వెంకటరత్నం, నరాల శ్రీనివాస్, వాసిరెడ్డి భాస్కరబాబు, రాపర్తి రామకృష్ణ, సోమరౌతు తిరుమల వెంకన్నదొర, రాయి ప్రసాద్, చెన్నాడ భీమరాజు, చెన్నాడ దేవుడు తదితరులు పాల్గొన్నారు.
బతుకు బూడిదైంది
బతుకు బూడిదైంది


