కోడి పందేలపై డ్రోన్లతో నిఘా
● ఏజెన్సీలో పోలీసుల వినూత్న ప్రయోగం
● కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
చింతూరు: ఇటీవల కాలంలో డ్రోన్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అన్ని శాఖల్లోనూ వీటి వాడకం ఎక్కువైంది. సాధారణంగా అడవుల్లో మావోయిస్టుల సంచారం తెలుసుకునేందుకు, గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు డ్రోన్లను వినియోగిస్తుంటారు. తాజాగా కోడిపందేలను అడ్డుకునేందుకు కూడా వీటిని వాడుతున్నారు. ఏజెన్సీలో కోడిపందేలపై పోలీసులు వినూత్నంగా డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. మామూలుగా అటవీ ప్రాంతాల్లో గుబురుగా ఉండే చెట్ల కింద బరులు ఏర్పాటు చేసి కోడిపందేలు నిర్వహిస్తుంటారు. ఈ సమాచారం తెలుసుకుని పోలీసులు అక్కడకు వెళ్లేలోపుగానే పందెం రాయుళ్లకు ఫోన్ల ద్వారా విషయం తెలిసిపోతుంది. దీంతో వారు పోలీసులు రాకముందే వారు అక్కడి నుంచి తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు డ్రోన్లను వినియోగిస్తున్నారు.
రెండు రకాల డ్రోన్లు
ముందుగా డ్రోన్‌ను ఎగురు వేసి, కోడి పందేలు జరుగుతున్న ప్రాంతాన్ని పసిగడుతున్నారు. అనంతరం పందెం రాయుళ్లకు అనుమానం రాకుండా ఆ ప్రాంతానికి చేరుకుని, వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా చింతూరు మండలం బొడ్రాయిగూడెం శివారు ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడిపందేలపై డ్రోన్ సాయంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ పందేలు నిర్వహిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. కోడిపందేలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు రెండు రకాల డ్రోన్లను వినియోగిస్తున్నారు. రెండు కిలోమీటర్ల పరిధి కలిగిన డ్రోన్లను ఆయా మండలాల పోలీసుస్టేషన్ల పరిధిలో వాడుతున్నారు. మరో వైపు 23 కిలోమీటర్ల పరిధి కలిగిన అత్యాధునిక డ్రోన్‌తో సబ్ డివిజన్ పోలీసు అధికారి స్థాయిలో నిఘా పెడుతున్నారు.


