జాయింట్ కలెక్టర్‌గా స్మరణ్‌రాజ్
రంపచోడవరం: జాయింట్ కలెక్టర్‌గా రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్ మంగళవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన, రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కొత్త జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
విద్యుత్ సమస్యలుంటే తెలియజేయండి
రంపచోడవరం: జిల్లా పరిధిలో విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే దరఖాస్తుల ద్వారా గానీ, వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా తెలియజేయవచ్చని ఏపీఈపీడీసీఎల్ డీఈ బీవీ రమణ తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ద్వారా పోలవరం జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ఉన్న గ్రామాల్లో విద్యుత్ వినియోగదారుల రిటైల్ ధరలపై 2026–27 ఆర్ధిక సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఈ నెల 20, 22, 23, 27 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. అలాగే వ్యక్తిగతంగా ఉదయం 10.30 నుంచి 1.30 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. సాయంత్రం 2.30 నుంచి 4.30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిటైల్ ధరలపై కార్యక్రమం జరుగుతుందన్నారు.


