ప్రమాదకరంగా కిండ్ర రోప్ వే
రాజవొమ్మంగి: మండలంలోని కిండ్ర – కిండ్ర కాలనీ గ్రామాల మధ్య మడేరు వాగుపై (పెద్దేరు) ఉన్న రోప్ వే మరమ్మత్తులకు గురై ప్రమాదకరంగా ఉందని రాజవొమ్మంగి ఎస్సై శివకుమార్ అన్నారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ ఒకరు లేదా ఇద్దరు చొప్పున మాత్రమే ఈ వంతెన దాటాలని, ఒకేసారి ఎక్కువ మంది నడవొద్దని కోరారు. కిండ్ర రోప్ వే ప్రస్తుతం ఒక పక్కకు ఒరిగిపోయి ఉందన్నారు. ఈ వంతెన ఆధారంగా రాకపోకలు సాగిస్తున్న ప్రజలు అతి జాగ్రత్తగా దాటాలని కోరారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ అల్లు సత్యనారాయణ, ఎంపీడీఓ ఎల్.యాదగిరీశ్వరావులతో కలిసి పరిస్థితిని సమీక్షించామన్నారు. ఈ వంతెన ప్రస్తుత పరిస్థితిపై అధికారులు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వంతెనకు ఇరువైపుల హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
రైఫిల్ షూటింగ్
పోటీల్లో ప్రతిభ
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఒడిశాలో ఈ నెల 10 నుంచి జరుగుతున్న జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో స్థానిక జిల్లా క్రీడా మైదానంలోని రైఫిల్ షూటింగ్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. అగస్టీన్ బంగారు, చైతన్యరెడ్డి, అనిల్ రజత పతకాలు, వి.చాందిని, లక్ష్మీ సాగరికరెడ్డి కాంస్య పతకాలు సాధించారు. కోచ్ అహ్మద్ ఆలీషా షరీఫ్ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులు గిరిజన క్రీడాధికారి ఎస్‌వీ రమణను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని వారికి రమణ సూచించారు. శిక్షణ ఇచ్చిన కోచ్ షరీఫ్‌ను అభినందించారు.
అప్పుడు నీ ధర్మం
ఎక్కడికి పోయింది?
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘ఏకవస్త్రగా, రజస్వలగా ఉన్న ద్రౌపదిని నీ మద్దతుతో దుశ్శాసనుడు పరాభవిస్తున్నప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయిందంటూ కర్ణుడిని కృష్ణుడు ప్రశ్నించాడ’ని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాస భారత ప్రవచనంలో భాగంగా స్థానిక హిందూ సమాజంలో ఆయన మంగళవారం కర్ణ వధను వివరించారు. ‘‘విప్రుని శాపం వలన కర్ణుని రథం భూమిలోకి కూరుకుపోయింది. రథచక్రం పైకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న కర్ణుడు ‘క్షణకాలం ఆగాల’ని కోరతాడు. ‘ఈ సమయంలో నాపై బాణాలు ప్రయోగించడం అధర్మమ’ని అంటాడు. ‘నీవు నేటికి ధర్మాన్ని తలచుకోవడం అదృష్టం. కష్టాల్లో చిక్కుకున్నప్పుడు దైవాన్ని నిందిస్తారు, తాము చేసిన చెడ్డ పనులను స్మరించరు. పాచికలు ఆడటం చేతకాని ధర్మరాజును వంచనతో గెలిచినప్పుడు, 13 సంవత్సరాలు నియమానుసారం వనవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసినా, వారి రాజ్యభాగాన్ని ఇవ్వడానికి తిరస్కరించినప్పుడు, అందరూ కలసి ఏకాకిగా ఉన్న అభిమన్యుడిని వధించినప్పుడు– నీ ధర్మం ఎక్కడికి పోయింది?’ అని తన దోషాలను కృష్ణుడు చెబుతూంటే, కర్ణుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. నేలమీద ఉన్నప్పుడు కూడా అతడు యుద్ధం ఆపలేదు. అర్జునుడు దివ్యాస్త్రాన్ని సంధిస్తూ, ‘నేను తపస్సు చేసి ఉంటే, గురువులను సేవించి ఉంటే, యజ్ఞయాగాదులు చేసి ఉంటే, మిత్రులను గౌరవించినవాడినైతే, ఈ అస్త్రం కర్ణుడిని వధించుగాక!’ అని ప్రయోగించాడు. ఆ అస్త్రం కర్ణుడి శిరస్సు ఖండించింది. కర్ణార్జునుల యుద్ధం కురుక్షేత్ర సంగ్రామంలో ముఖ్యమైన సన్నివేశం’’ అని సామవేదం అన్నారు. తీవ్ర దుఃఖంలో పడిన దుర్యోధనుడిని శల్యుడు ఓదారుస్తూ, దైవం పాండవుల పక్షాన ఉందని, శోకించి ప్రయోజనం లేదని చెబుతాడు. దుర్యోధనుడికి తాను చేసిన అవినీతి పనులన్నీ గుర్తుకు వచ్చాయి. అంతకు ముందే, దుశ్శాసనుడిని భీముడు వధించి, తన ప్రతినను నిజం చేసుకున్నాడ’ని సామవేదం అన్నారు.
ప్రమాదకరంగా కిండ్ర రోప్ వే
ప్రమాదకరంగా కిండ్ర రోప్ వే


