రహదారుణం
● అధ్వానంగా కొండ్రాజుపేట రహదారి
● ఏళ్ల తరబడి అభివృద్ధికి దూరం
● రాకపోకలకు గిరిజనుల అవస్థలు
● 30 గ్రామాలకే ఇదే ఆధారం
కూనవరం: నిత్యం జనసంచారంతో రద్దీగా ఉండే కొండ్రాజుపేట రహదారికి మోక్షం లభించడం లేదు. టేకులబోరు నుంచి కొండ్రాజుపేట మీదుగా చినార్కూరు, పెదార్కూరు, కూటూరు మీదుగా చింతూరు మండలం చట్టి వరకూ ఉన్న రహదారి భారీ గోతులతో అధ్వానంగా మారింది. ఇది ఏడు పంచాయతీల పరిధిలోని 30 గ్రామాల గిరిజనులకు దగ్గర మార్గం. అర్ధ శతాబ్దం కిందట జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రహదారిని ఆ తర్వాత పట్టించుకునే నాథుడే లేడని గిరిజనులు వాపోతున్నారు.
అభివృద్ధికి దూరం
కొండ్రాజుపేట రోడ్డును అభివృద్ధి చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు ఏళ్ల తరబడి అధికారులకు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. చింతూరు ఐటీడీఏలో అనేకసార్లు దరఖాస్తులు కూడా ఇచ్చారు. అయినా రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకోలేదు. ఈ రోడ్డుకు ఇరువైపులా వందల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. రైతులు, వ్యవసాయ కూలీల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ట్రాక్టర్లు, వ్యాన్లు, ఆటోలపై వ్యవసాయ కూలీలు పొలం పనులకు వెళ్లడం, సాయంత్రం కాగానే ఇళ్లకు చేరుకోవడం జరుగుతుంది. రైతులు ఎరువులు, పురుగు మందులు, మిర్చి, పొగాకు నారును (మొక్కలను) పొలాలకు తరలిస్తుంటారు. వాహనాల రద్దీ ఎక్కువ ఉండడంతో కొండ్రాజుపేట రహదారిపై పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వర్షం వస్తే ఆ గోతుల్లో నీరు నిండిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు ద్విచక్ర వాహన చోదకులు ఆ గోతుల్లో పడి గాయాలపాలవుతున్నారు.
మాజీ ఎంపీ చొరవతో..
గిరిజనులు వివిధ పనులపై మండల కేంద్రానికి రావడానికి ఈ రోడ్డే దగ్గరి మార్గం. అర్ధ శతాబ్దం క్రితం మెటల్ రోడ్డుగా ఉండేది. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో దీన్ని టేకులబోరు నుంచి చింతూరు మండలం చట్టి వరకు తొలుత గ్రావెల్ రోడ్డు, కొద్ది కాలం తర్వాత మెటల్ రోడ్డుగా నిర్మించారు. 1997లో మాజీ ఎంపీ సోడె రామయ్య చొరవతో టేకులబోరు నుంచి జిన్నెలగూడెం వరకు ఆరు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మించారు. అప్పటి నుంచి నేటి వరకూ ఈ రోడ్డుపై తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి వరదలు
గోదావరి వరదలు ఈ రహదారికి శాపంగా మారాయి. తరచూ వచ్చే వరదలకు రోడ్డు ఎక్కడికక్కడ కొట్టుకు పోయింది. కొద్దిపాటి వర్షానికే చిత్తడిగా మారుతోంది. కొండ్రాజుపేట వాగుపై ఉన్న లోలెవెల్ కాజ్‌వే ఎత్తు పెంచితే ఎగువనున్న గిరిజన గ్రామాలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు చెబుతున్నారు. వరద ముప్పు నుంచి ఉపశమనం పొందాలంటే కనీసం 10 అడుగుల మేర ఎత్తు పెంచాలని సూచిస్తున్నారు. వర్షాకాలంలో కొద్దిపాటి వరదొస్తే చాలు కొండ్రాజుపేట కాజ్‌వే ముంపునకు గురవుతోంది. తద్వారా 15 గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వరదలు తగ్గిన అనంతరం దాదాపు నెల రోజుల వరకు ఈ రహదారిపై రాకపోకలు సాగించడం నరక ప్రాయంగా మారుతుంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే కాజ్‌వే ఎత్తు పెంచాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు ఎత్తు పెంచితే భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయినా కొండ్రాజుపేట, టేకులబోరు గ్రామాల మధ్య రాకపోకలు సాగే అవకాశం ఉంటుందని గిరిజనులు చెబుతున్నారు.
రహదారుణం


