రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: సంక్రాంతి సెలవులు కావడంతో రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రధానంగా తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మంగళవారం స్వామి సన్నిధికి వచ్చి, పూజలు చేశారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంలో రద్దీ ఏర్పడింది. అధిక శాతం భక్తులు కార్లు, ఇతర వాహనాల్లో వచ్చారు. దీంతో, దేవస్థానంలోని పార్కింగ్ స్థలాలన్నీ వారి వాహనాలతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారిని 25 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.
నేడు సత్యదేవుని గ్రామోత్సవం
ధనుర్మాసోత్సవాల సందర్భంగా సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను గత నెల 16 నుంచి ప్రతి రోజూ ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకూ అన్నవరంలో పల్లకీలో ఊరేగిస్తున్నారు. ఇందులో భాగంగా ఏటా భోగి పండగ నాడు అన్నవరం రైల్వే స్టేషన్ రోడ్డు, ఇండియన్ బ్యాంక్ పక్క నుంచి వరదయ్య వీధి, వెలంపేటల్లో ఈ ఊరేగింపు నిర్వహించే ఆనవాయితీ ఉంది. ఈ మేరకు ఆ ప్రాంతాల్లో బుధవారం స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించనున్నారు.


