breaking news
yechuri sitaram
-
కాంగ్రెస్కు మద్దతుపై ఏచూరి వర్సెస్ తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్కు మద్దతు విషయంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. ‘తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగాం. కాబట్టి మేం పోటీ చేయని నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు ఓటేయ్యాలి’అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అలాంటి స్పష్టత ఎక్కడా ఇవ్వడంలేదు. ‘మా పార్టీ పోటీ చేసే 19 నియోజకవర్గాలు మినహా బీజేపీ బలంగా ఉన్నచోట్ల దానిని ఓడించగల పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నాం. కొత్తగూడెంలో సీపీఐ, పినపాకలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ, శేర్లింగంపల్లిలో ఎంసీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాము. మిగిలిన స్థానాలలో ఎవరిని బలపరచాలో పార్టీ జిల్లా కమిటీలు తగు నిర్ణయం తీసుకొని ప్రజాతంత్ర, లౌకిక, సామాజిక, పోరాట శక్తులకు మద్దతు ఇస్తాయ’ని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. చదవండి: రెండున్నర లక్షల ఓట్లు.. ఆర్టీసీ ఉద్యోగులు ఎటు వైపో? ఇక్కడ ఏచూరి ప్రకటనకు, తమ్మినేని ప్రకటనకు మధ్య వైరుధ్యం ఉందని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ‘ఇండియా’కూటమిలో ఉన్నందున తాము కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని ఏచూరి స్పష్టం చేయగా, తమ్మినేని మాత్రం అలాంటి స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో ఆ పార్టీని ఓడించగలిగే పార్టీలకు ఓటు వేయాలని కోరుతున్న తమ్మినేని, మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్కు ఓటు వేయమని ఎందుకు పిలుపునివ్వడంలేదని రాజకీయ విశ్లేషకులు ప్రశి్నస్తున్నారు. ఏచూరికి సమాచారం ఇవ్వలేదా? రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాల్లో బీజేపీ బలంగా ఉన్నచోట దాన్ని ఓడించే పార్టీలకు ఓటేయ్యాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. బీజేపీ బలంగా లేనిచోట ఏ పార్టీకి ఓటు వేయాలన్న దానిపైనే కేంద్ర కమిటీకి, రాష్ట్ర కమిటీకి మధ్య భిన్నాభిప్రాయం నెలకొంది.. సీతారాం ఏచూరికి రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని తెలియజేయలేదని తెలిసింది. కాగా, తాము పోటీ చేస్తున్న 19 స్థానాలలో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో కోరారు. చదవండి: డిసెంబర్ 4న జాబ్ కేలండర్ ఇస్తాం: కేటీఆర్ -
మన నిశ్శబ్దం చేసిన గాయం
సల్మాన్ రష్దీపై తీవ్రమైన దాడిపై మన రాజకీయనాయకులు చాలామంది నిశ్శబ్దంగా ఉండటం చూసి కలవరపడ్డాను, దిగులు పడ్డాను. 1988లో ‘శాటానిక్ వర్సెస్’ నవలను నిషేధించిన ఏకైక అతి పెద్ద ప్రజాస్వామ్యం మనదే. ఆ పుస్తకాన్ని చదవకుండానే మనం దాన్ని నిషేధించేశాము. 34 సంవత్సరాల తర్వాత రష్దీపై జరిగిన దాడిని ఖండించని ఏకైక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా మనదే. ఎందుకు అనేది నాకు నిజంగానే అర్థం కావడం లేదు. సల్మాన్ రష్దీ భారతదేశంలో జన్మించారు. ఆయన పౌరసత్వం మారి ఉండవచ్చు కానీ, ఈ దేశంతో తన ఉనికిని ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. 2000 సంవత్సరంలో ‘బీబీసీ హార్డ్టాక్ ఇండియా’ కోసం ఆయనతో చేసిన ఇంటర్వ్యూలో ‘‘ఈ దేశం ఇప్పటికీ మీ ఇల్లేనా?’’ అని ప్రశ్నించాను. దానికి ఆయన సమాధానం ఏమిటో తెలుసా? ‘‘ఏ దేశంలో మీరు పుట్టారో, పిల్లవాడిగా మీరు ఏ దేశంలో పెరిగారో అది ఎప్పటికీ మీ ఇంటిలాగే ఉంటుంది. ఏ ఇతర ప్రదేశంలోనూ మీరు అలాంటి అనుభూతి చెందలేరు. నా పుస్తకాలు చదివిన ఎవరైనా సరే, ఈ దేశాన్ని ఇల్లు అని పిలవడంలో నా ఊహాస్థాయిని తెలుసుకునే ఉంటారు.’’ నా తదుపరి ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం మరింత ఆసక్తికరంగా ఉండింది. ‘‘సల్మాన్ రష్దీ భారతీయుడా లేక ఆంగ్లేయుడా లేక పాకిస్తానీయుడా? ఏ ఉనికిని మీరు అంగీకరిస్తారు?’’ అని అడిగాను. ఈ ప్రశ్నకు ఆయన సమాధానం క్లుప్తంగా, నిక్కచ్చిగా ఉండటమే కాదు, అది సరళం కూడా. ‘‘ఓహ్ పాకిస్తానీ మాత్రం కాదు,’’ అంటూ తర్వాత ఆయన నవ్విన నవ్వు వెక్కిరిస్తున్నట్లుగా ధ్వనించింది. పాకిస్తానీగా ఉండటం అనే ఆలోచనే ఆయనకు హాస్యాస్పదంగా తోచింది. మరి మన ప్రముఖ రాజకీయ నేతల నుంచి ఆయనపై దాడిపట్ల ఖండనకు సంబంధించిన వ్యక్తీకరణ బహిరంగంగా ఎందుకు రాలేదు? అక్కడ జరిగినదానిపై వారు ఎందుకు ఆగ్రహం ప్రదర్శించలేదు? కనీసం ఆయన కోలుకోవాలని సానుభూతి ప్రకటించడానికి కూడా వీరు ఎందుకు ఇష్టపడలేదు? అసలెందుకు వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు? నిస్సందేహంగా వేళ్ల మీద లెక్కబెట్టినంతమంది మాట్లాడారు. బహిరంగంగా ఆ దాడి గురించి మాట్లాడిన ఏకైక పార్టీ నేత సీతారాం ఏచూరి. మిగతావారికి దాని గురించి మాట్లాడటానికి ఏమీ ఉన్నట్టు లేదు. ప్రధాని నరేంద్రమోదీ, ఆయన మొత్తం మంత్రి మండలి మాత్రమే కాదు... సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, ఎంకే స్టాలిన్, నితీశ్ కుమార్, కోనార్డ్ సంగ్మా, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా... రష్దీపై దాడి గురించి విన్నప్పుడు వీరిలో ఏ ఒక్కరూ దానిగురించి నిజంగానే అనుభూతి చెందలేకపోయారా? లేదా రాజకీయాలు లేక ముస్లిం ఓటర్లను గాయపరుస్తామనే భయానికి గురయ్యారా లేక ఇరాన్ ప్రభుత్వానికి ఇబ్బంది కలగకూడదనే విషయం మౌనం పాటించేలా చేసిందా? పూర్తి వాస్తవం ఏమిటంటే, ఈ విషయం మీద మన విదేశీ వ్యవహారాల మంత్రి మాట్లాడారు. కానీ ఆయన చెప్పింది ఏమిటో పరిశీలించినప్పుడు, దానికంటే నిశ్శబ్దంగా ఉండటమే ఉత్తమమని అనిపిస్తుంది. బెంగళూరులో జరిగిన పత్రికా సమావేశంలో ఒక ప్రశ్నకు స్పందిస్తూ జై శంకర్ ఇలా అన్నారు: ‘‘నేను కూడా దాని గురించి చదివాను. మొత్తం ప్రపంచమే దాన్ని గమనించింది. మొత్తం ప్రపంచమే అలాంటి దాడి పట్ల స్పందించింది.’’ మొత్తం ప్రపంచం స్పందించింది కానీ మన విదేశీ వ్యవహారాల మంత్రి మాత్రం కాదు. ఆ దాడి పట్ల ఆయనది స్పందన కాదు. కచ్చితంగా ఆ దాడి గురించిన ఖండన కాదు. కేవలం ఆ దాడి గురించి తనకు తెలుసు అని మాత్రమే చెప్పారాయన. రష్దీ అతి గొప్ప రచయిత కావచ్చు. భారత సంతతి రచయితగా అందరికీ తెలిసిన, చాలామంది చదవగలగిన రచయితగా ఉండొచ్చు. కానీ ఆయనకు మనం మద్దతు తెలుపడానికి అంగీకరించలేకపోయాం. ఈలోగా తక్కిన ప్రపంచం ఆయన్ను కౌగలించుకుంది, తమవాడిని చేసుకుంది. ‘‘ఆయన పోరాటం మా పోరాటం’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ చెప్పారు. ‘‘గతంలో కంటే మిన్నగా మేం ఆయన పక్షాన నిలబడతాం’’ అన్నారు. కాబట్టి నిక్కచ్చిగా నన్ను ప్రశ్నించనివ్వండి. మనం ఎవరివైపు నిలబడుతున్నాం? ఈ విషయాన్ని మరింత స్పష్టంగా ప్రకటించాల్సిన సందర్భాలు తారసపడతాయి. ఇలాంటి సందర్భంలో ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన ప్రతిష్ఠను దెబ్బతీస్తాయి కూడా. మనవాడు అని గర్వంగా చెప్పుకోగలిగిన వ్యక్తిపై దాడి జరిగినప్పుడు, మనం ఆయన గురించి ఎందుకు ఏమీ చెప్పలేకపోయాం? ప్రవాస భారతీయుల పట్ల మన వైఖరి గురించి ఇది ఏమని సూచిస్తోంది? సల్మాన్ రష్దీ మన ఉజ్జ్వల తారల్లో ఒకరు కాదా? లేక ఆయన పుట్టిపెరిగిన విశ్వాసమే ఇక్కడ సమస్యాత్మకంగా ఉంటోందా? (నిజానికి ఆ విశ్వాసాన్ని ఆయన పాటించడం లేదు). (క్లిక్: ఇండియాపై పందెం కాసిన సాహసవంతుడు) రష్దీ గతంలో చెప్పిన చివరి మాటను ప్రస్తావించనివ్వండి. భారత్ తనను తిరస్కరించినట్లు రష్దీ భావిస్తున్నారా అని నేను బీబీసీ ఇంటర్వ్యూలో అడిగాను. ఎందుకంటే భారత్ అనేక సంవత్సరాలుగా ఆయనకు వీసాను నిరాకరించింది. ‘‘అవును, నేను అలా భావించాను’’ అని రష్దీ సమాధానం ఇచ్చారు. ‘‘చాలా గాయపడిన భావన కలిగింది. భారత్కు దూరంగా ఉండటం అప్పటి సంవత్సరాల్లో చాలా బాధాకరమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నేను భావించాను. నేను భారత్కు తిరిగి రావడాన్ని ప్రేమించాను. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే వాడిని’’ అన్నారు. కానీ బహుశా ఇప్పుడు మన నిశ్శబ్దం ఆయన పాతగాయానికి జత కలిసివుంటుంది. (క్లిక్: ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!) - కరణ్ థాపర్ సీనియర్ పాత్రికేయులు -
'వాళ్లను వివాదాల్లోకి లాగొద్దు'
న్యూఢిల్లీ: భారత్-పాక్ వివాదాల్లోకి సినీ కళాకారులను, ఆటగాళ్లను లాగొద్దని సీపీఐ నేత సీతారం ఏచూరి అన్నారు. రాజకీయాలకు అతీతంగా వారిని ఆయా రంగాల్లో రాణించనివ్వాలని ఆయన శనివారమక్కడ వ్యాఖ్యానించారు. కాగా, సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పరిస్ధితులు సద్దుమణిగే వరకూ పాక్ సినీ కళాకారులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కళలు, ఆటలను సమస్యలకు అతీతంగా నడవనిచ్చే స్ధాయికి అందరూ చేరుకోవాలని ఏచూరి అన్నారు. పాక్ సినీ కళాకారుల నిషేధంపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కళాకారుల్లో లేదా ఆటగాళ్లలో ఎవరైనా దేశ భద్రతకు ఆటంకం కలిగిస్తారని భావిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.