breaking news
y vijaya
-
గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ ఎమోషనల్
తింటూ కూర్చుంటే కొండలైనా కరుగుతాయంటారు. తింటేనే కాదు.. అందరికీ పంచిపెడుతూ కూర్చుంటే కూడా చివరికి చేతిలో ఏవీ మిగలకుండా పోతాయి. ఈ స్టార్ కమెడియన్ విషయంలోనూ ఇదే జరిగింది. అటు దానాలు, ఇటు భర్త చేసిన జల్సాలతో డబ్బంతా పోయి రోడ్డునపడింది. ఆమె మరెవరో కాదు.. ఆన్‌స్క్రీన్‌పై నవ్వులు పూయించే గిరిజ.పెళ్లితో కష్టాలుతరాలు తరబడి కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదించింది గిరిజ (Girija). అడిగినవారికి కాదనకుండా సాయం చేసేది. పెళ్లి అనే నిర్ణయంతో ఆమె జీవితమే తలకిందులైంది. జల్సాగా తిరిగే భర్త ఆస్తిని కర్పూరంలా కరిగించేశాడు. తాగిన మైకంలో ఆమెపై చేయి చేసుకునేవాడు కూడా! ఓసారి చేతికందిన వస్తువుతో కొట్టడంతో ఆమె తలకు పద్నాలుగు కుట్లు పడ్డాయి.ఆత్మాభిమానం చంపుకుని..ఖర్చు చేయడానికి ఏమీ మిగల్లేదన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. తర్వాత అప్పులపాలైన గిరిజ విశాలవంతమైన ఇల్లు వదిలేసి చిన్న గదికి షిఫ్ట్ అయింది. చివరి రోజుల్లో తన ఆత్మాభిమానాన్ని చంపుకుని డబ్బు కోసం చేయి చాచి అర్థించింది. అనాథగా బస్టాప్‌లో తనువు చాలించింది. ఆమె మలి జీవితంలో పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంది ప్రముఖ నటి వై.విజయ (Y Vijaya).అలాంటి పరిస్థితి..తాజాగా ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. గిరిజగారు సొంత ఖర్చులతో ఆర్టిస్టులను, స్నేహితులను కలకత్తాలో దేవీపూజకు తీసుకువెళ్లి వచ్చేవారు. అంత పెద్ద, మంచి నటి తర్వాత దయనీయ స్థితిలో బతుకు సాగించారు. చెన్నైలో మా ఇంటికి వచ్చి రూ.50, రూ.100 అడిగేవారు. వాళ్ల అమ్మ వచ్చి.. చీరలేమైనా ఉంటే ఇవ్వండి అని అడిగేవారు. ఎన్నో దానధర్మాలు చేసిన ఆర్టిస్టులు చివరి క్షణాల్లో ఆర్థికంగా చితికిపోయారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని చెప్తూ విజయ భావోద్వేగానికి లోనైంది.సినిమావై. విజయ.. పద్నాలుగేళ్లవయసులో సినీరంగంలో ప్రవేశించింది. నిండు హృదయాలు సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేసింది. విచిత్ర బంధం, గంగ మంగ, మయూరి, ముద్దుల కృష్ణయ్య, నువ్వు వస్తావని, రాజా, బడ్జెట్ పద్మనాభం, ఛత్రపతి, అమ్మోరు, ఎఫ్ 2, ఎఫ్ 3.. ఇలా పలు సినిమాల్లో నటించింది.చదవండి: అభిమానులపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. వెళ్లిపోతానంటూ.. -
చనిపోయే వరకు నటిస్తూనే ఉంటా..!
సాక్షి, చెన్నై: ‘పద్నాలుగేళ్లపుడు సినీరంగంలోకి వచ్చా... చనిపోయే వరకు నటిస్తూనే ఉంటా’నని సీనియర్ సినీనటి వై విజయ చెప్పారు. నేడు నాలుగో తరంతో నటిస్తున్నా, నాటితో పోల్చుకుంటే నేటి నటీనటుల్లో క్రమశిక్షణ, అంకితభావం కరువైపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నపురి ట్రస్ట్ మహిళా విభాగ్ నెలనెలా నిర్వహించే సెలబ్రెటీలతో ముచ్చట్లు కార్యక్రమంలో సోమవారం నటి వై.విజయ, దివంగత నటి రాజసులోచన కుమార్తె, కళాకారిణి దేవీ కృష్ణ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళలకు నటి వై విజయ తన జీవనగమనాన్ని వివరించారు. ఆమె మాటల్లోనే.. ఆరేళ్ల చిన్నారిగా ఒక సమావేశంలో పక్కన ప్రముఖ నటి రాజసులోచన కూర్చుని నన్ను దగ్గర తీసుకున్నారు. నన్ను నాట్యకళాకారిణిగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో తల్లిదండ్రులు చెన్నైకి మకాం మార్చారు. క్లాసికల్ కర్నాటక డ్యాన్స్ నేర్చుకున్నాను. 14 ఏళ్ల వయస్సులో 1953లో ఒక డాన్స్మాస్టారు నా ఫొటో అల్బం చూడడంతో సినీరంగ ప్రవేశం జరిగిపోయింది. తొలి చిత్రమే శోభన్‌బాబు పక్కన హీరోయిన్. ఆ తరువాత ఎంజీఆర్, శివాజీ, ఎన్టీఆర్ వంటి మహామహులతో పనిచేశాను. ఠంచనుగా టైమ్‌కు రావాలి, సెట్లోకి వచ్చే ముందే స్క్రిప్ట్, సీన్ తెలుసుకోవాలి తదితర క్రమశిక్షణ సీనియర్ల నుంచే నేర్చుకున్నాను. తెలుగులో మంగమ్మగారి మనుమడు చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం నేను నాలుగో తరంతో నటిస్తున్నానంటే ఆనందగా ఉందని వై విజయ అన్నారు. దివంగత నటి రాజసులోచన కుమా ర్తె, ప్రముఖ నాట్యకళాకారిణి దేవీ కృష్ణ తన మాటల్లో అమ్మ అనుభవాలను పంచుకున్నారు. 1953లో విడుదలైన ‘కన్నతల్లి’ మా అమ్మకు తొలి చిత్రం. గొప్ప నటి, నర్తకి అయిన అమ్మ రాజసులోచన దక్షిణాది భాషలతో పాటూ మొత్తం ఐదుభాషల్లో 325 చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఎక్కడికి వెళ్లినా రాజసులోచన కూతురివా అంటూ ఆప్యాయంగా చూస్తుంటారు. అందుకే ఈ నాటికీ నలుగురులోకి వెళ్లినపుడల్లా అమ్మ గొప్పదనం ఆస్వాదిస్తుంటాను. అలాగే తండ్రి సీఎస్ రావు కూడా ప్రముఖ సినీ దర్శకులుగా పేరుగాంచారు. అమ్మానాన్నలు ఇద్దరూ సినీరంగంలో బీజీగా ఉండడాన్ని చూసినందునే నేను వారసురాలిగా రాలేదు. అయితే అమ్మ స్ఫూర్తితో నేను కూడా క్లాసికల్ కర్నాటక డ్యాన్స్ నేర్చుకున్నాను. అమ్మతో కలిసి అనేక నాట్య ప్రదర్శనలు ఇచ్చాను. స్టేజిషోల్లో గాత్రదానం కూడా చేశాను. నాలుగేళ్ల క్రితమే ఆమె కన్నుమూశారు. ఈరోజు అమ్మ జ్ఞాపకాలతో తెలుగు మహిళలను కలుసుకోవడం ఆనందగా ఉందని అన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ, భిన్నకోణాల్లో తన నటనా పటిమను చాటుకుంటూ గత ఆరుదశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్న నటి వై.విజయను, బహుముఖ ప్రజ్ఞాశాలి రాజసులోచన కుమార్తె దేవీ కృష్ణ హాజరుకావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రతినెల ఒక సెలబ్రెటీతో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా నేడు ఈ ఇద్దరు కళాకారులు హాజరయ్యారని మహిళావిభాగ్ అధ్యక్షురాలు ఉప్పులూరి విజయలక్ష్మి అన్నారు. నటుడు రాజ్‌కుమార్, విభాగ్ కోశాధికారి భారతి, మెహతా హాస్పిటల్స్ జనరల్ మేనేజర్ యువరాజ్ గుప్త, చెన్నైపురి ట్రస్ట్ నగర అధ్యక్షులు బెల్లంకొండ సాంబశివరావు, వామ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ పొన్నూరు రంగనాయకులు పాల్గొన్నారు. -
‘పులుసు’ పేరుతెచ్చింది కానీ...
ఫేమస్ బాలీవుడ్ సింగర్ కమ్ హీరో కిశోర్‌కుమార్ పక్కన కథానాయికగా నటించిన తెలుగమ్మాయి ఎవరో తెలుసా? క్లాసూ మాసూ, కామెడీ, సెంటిమెంట్ ఏదైనా చేయగల గ్లామరస్ యాక్ట్రెస్ గుర్తున్నారా? సరే... ఇవన్నీ ఎందుకు... ‘పులుసు’ గుర్తుందా? అరె.. ఆమెను ఎలా మర్చిపోతాం. ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమా వచ్చి ఇప్పటికి 30 ఏళ్లయ్యింది. అందులో ‘చేపల పులుసు’తో మగాళ్ళను పడేస్తూ వై. విజయ వేసిన వ్యాంప్ వేషం ఇప్పటికీ ఆమెకో బ్రాండ్ ఇమేజ్. ఓ పాత్ర పేరుతో ఓ ఆర్టిస్టు ఇన్నేళ్లు గుర్తుండిపోవడమంటే చాలా లక్కీ. హీరోయిన్గా ఎదగాల్సిన ఆమెకేరక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయారు. అసలేం జరిగింది? ఫుల్ డీటైల్స్ వై. విజయనే అడిగేద్దాం! ఎన్నేళ్లయ్యిందండీ.. మిమ్మల్ని చూసి... అవునవును. నన్ను కలిసిన చాలామంది ఇదే మాట అంటుంటారు. అందరికీ దూరంగా ఉండాలని నాకూ లేదు. అంతేకాదు, సినిమాలు కూడా చేయాలనే ఉంది. మంచి అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. హెల్త్ బాగున్నంత కాలం యాక్టింగ్ మానే ఉద్దేశం లేదు. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? వృత్తిపరంగా ఏమీ లేదు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం బిజీగా ఉన్నాను. ఈ మధ్యనే అమ్మమ్మగా ప్రమోషన్ వచ్చింది. నా ఒక్కగానొక్క కూతురు అనూష్యకు కొడుకు పుట్టాడు. ఆ హడావిడిలో ఉన్నాను. వాడి ఆలనా పాలనా చూసుకోవడంతో టైమ్ అస్సలు ఉండడం లేదు. మీ అమ్మాయిని హీరోయిన్ చేయాలనుకోలేదా? తనకు ఇంట్రస్ట్ ఉండుంటే కచ్చితంగా చేసేవాళ్లం కానీ, బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకుంది, స్థిరపడింది. మీ శ్రీవారి గురించి చెప్పండి. మీ ఇద్దరిదీ ప్రేమ వివాహమా? మావారి పేరు అమలనాథన్. మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహంలాంటిదన్నమాట. ఆయన మా ఫ్యామిలీకి ముందునుంచీ తెలుసు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని తెలుసుకున్న మా పెద్దలు మా పెళ్లి కుదిర్చేశారు. 1985 జనవరి 27న మా పెళ్లయ్యింది. ఆయన కాలేజ్ కరస్పాండెంట్‌గా పని చేసేవారు. రిటైరయ్యాక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. యాక్టింగ్ విషయంలో మీవారి నుంచి అభ్యంతరాలేవీ ఎదురు కాలేదా? అస్సల్లేదు. నటన వేరు, జీవితం వేరనే సంగతి ఆయనకు తెలుసు. ఇప్పటికీ మీపై ‘పులుసు’ బ్రాండ్ పోలేదు... అవును. ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమాలోని ఆ పాత్ర నా జీవితాన్ని మలుపు తిప్పింది. సరిగ్గా ఆ టైమ్‌లోనే నాకు పెళ్లి కుదిరింది. ఆయనకు నా పాత్ర గురించి చెప్పి ఓకే అన్నాకనే నేను ఓకే చెప్పాను. ఇప్పటికీ నన్ను చాలామంది ‘పులుసు’ అనే పిలుస్తుంటారు. ఓ పాత్ర పేరుతో గుర్తున్నందుకు ఆనందమే కానీ, వాటిని మా నిజజీవితానికి ఆపాదించినప్పుడే బాధగా, ఇబ్బందిగా ఉంటుంది. కరెక్టే.. మీ మీద ఉన్న ‘వ్యాంప్’ ముద్ర కారణంగా మీ గురించి వేరే రకంగానే అనుకునే అవకాశం ఉంది... అది తప్పంటాను. ఎందుకంటే, సినిమా కోసం మేం ఏం చేసినా అది నటనే అవుతుంది. వ్యాంప్ పాత్రలు చేస్తే.. నిజంగా కూడా అలానే ఉంటామనుకుంటే పొరపాటు! నా జీవితం, జీవన విధానం నా సహనటీనటులకు బాగా తెలుసు. కానీ, ప్రేక్షకులకు తెలియదు కాబట్టి, వాళ్లు వేరేలా అనుకుంటారు. అందుకే అంటున్నా... నటీనటులు చేసే పాత్రలను బట్టి వారిని అంచనా వేయొద్దు. వాస్తవానికి హీరోయిన్‌కి ఉండాల్సిన అందచందాలు మీకున్నప్పటికీ ఎందుకు రాణించలేదంటారు? ఎవరూ మిమ్మల్ని తొక్కయ్యలేదుగా? లేదు, ఈ విషయంలో ఎవరినీ నిందించాల్సిన అవసరంలేదు. నాకు మొదట్లో సినిమాలంటే ఆసక్తి ఉండేది కాదు. అనుకోకుండా అవకాశం రావడంతో వచ్చేశాను. హీరోయిన్‌గానే చేయాలనే పట్టుదల ఉండేది కాదు. ఒకవేళ అది బలంగా ఉండి ఉంటే, అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకునేదాన్నేమో! ఆ యావ లేకపోవడంతో, వచ్చిన ప్రతి పాత్ర చేశాను. దాంతో ముందు హీరోయిన్గా తీసుకున్నవాళ్లు, తర్వాత కేరక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. బరువు పెరగడమూ మైనస్ అనొచ్చా? మొదట్లో సన్నగానే ఉండేదాన్ని. పాప పుట్టిన తర్వాత బరువు పెరిగాను. బొద్దుగా ఉండటం మా ఫ్యామిలీ జీన్స్‌లోనే ఉంది. మా అమ్మ బొద్దుగానే ఉండేది. అసలు మీకు మొదటి అవకాశం ఎలా వచ్చింది? మద్రాసులో వెంపటి చినసత్యంగారి దగ్గర డాన్స్ నేర్చుకునేదాన్ని. ‘నిండు హృదయాలు’ అనే సినిమాలో అడుక్కుంటూ, డాన్స్ చేసే కేరక్టర్ ఒకటి ఉందని, డాన్స్ తెలిసినవాళ్లు కావాలని మా డాన్స్ స్కూల్‌కి వచ్చారు ఆ చిత్ర దర్శక, నిర్మాతలు. అక్కడ నన్ను ఎంపిక చేశారు. ఆ సినిమాలో ఎన్టీఆర్, జమున హీరో హీరోయిన్లు! ఆ తర్వాత ‘శ్రీకృష్ణ సత్య’లో మీకు ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది? వాస్తవానికి డాన్స్ స్కూల్లో పురందేశ్వరి, నేను స్నేహితులం. అందుకని, నాకు ఎన్టీఆర్‌గారి కుటుంబంతో ముందే పరిచయం ఉంది. ‘నిండు హృదయాలు’ తర్వాత ‘డబ్బుకు లోకం దాసోహం’ సినిమాలో ఎన్టీఆర్‌గారికి చెల్లెలిగా చేశా. ఆ తర్వాత ఆయన చేసిన ‘శ్రీకృష్ణ సత్య’లో జాంబవతి పాత్ర చేశా. ఆ పాత్ర ఒప్పుకున్న తర్వాత, ఓరోజు ఎన్టీఆర్‌గారు ‘అమ్మాయి.. నా పక్కన మరీ చిన్నపిల్లలా ఉంటావు. కాస్తంత బరువు పెరుగు’ అన్నారు. దాంతో నెయ్యి, పండ్లు తిని, ఐదు కిలోలు బరువు పెరిగాను. మరి.. హీరోయిన్గా ఎప్పుడు అవకాశం వచ్చింది? ‘తల్లిదండ్రులు’ సినిమాకి పదహారేళ్లమ్మాయి కావాలంటూ ఓ పేపర్ యాడ్ ఇచ్చారు. దాదాపు రెండువేల ఫొటోలు వచ్చాయట! మా డాన్స్ స్కూల్‌కి కూడా ఆ చిత్ర నిర్మాత వచ్చారు. నాకప్పుడు పద్నాలుగేళ్లుంటాయి. ఆ రెండువేల ఫొటోలను కూడా పరిశీలించిన తర్వాత, నేను ఆ పాత్రకి కరెక్ట్ అని తీసుకున్నారు. అందులో శోభన్‌బాబుగారు హీరో. మరి తమిళ సినిమాలలో అవకాశం ఎలా వచ్చింది? 1975లో తొలి నృత్యప్రదర్శన ఇచ్చాక, మా ఊరు (కడప) వెళ్లిపోదానుకున్నాను. కానీ, కె.బాలచందర్‌గారు ‘మన్మథలీలై’ సినిమాకి అడిగారు. కమల్‌హాసన్ హీరో. మంచి అవకాశం కదా అని చేశాను. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. శివాజీగణేశన్గారు, రజనీకాంత్‌గారు.. ఇలా ప్రముఖ హీరోల సరసన సినిమాలు చేశాను. హీరోయిన్గా, కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒక్క తమిళంలోనే 300 సినిమాలు చేశాను. హిందీలోనూ నటించా. కిశోర్ కుమార్ బాలీవుడ్లో ఫేమస్. ఆయన సరసన ‘చల్తీ కా నామ్ జిందగీ’లో ఎలా అవకాశం వచ్చింది? ఆ చిత్రంలో కథానాయిక తమిళమ్మాయి. అందుకని కిశోర్కుమార్గారు హీరోయిన్ని సెలక్ట్ చేయడానికి మద్రాసు వచ్చారు. అప్పటికి నేను బాలచందర్‌గారి సినిమాల్లో యాక్ట్ చేసి, బాగా పాపులర్ అయ్యాను. దాంతో, మేనేజర్ ద్వారా సంప్రదించారు. తర్వాత కిశోర్కుమార్గారు మా ఇంటికొచ్చి, నన్ను ఎంపిక చేశారు. అలాగే ‘మిస్ పమేలా’ అనే ఇంగ్లిష్ సినిమాలోనూ యాక్ట్ చేశాను. తమిళంలో బిజీ అవ్వడంవల్లే కొన్నేళ్లు తెలుగుకు దూరమయ్యారేమో? 1976 నుంచి 1984 వరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. తమిళంలో నేను చేసిన భారతీరాజాగారి ‘మన్వాసనై’ తెలుగులో ‘మంగమ్మగారి మనవడు’గా రీమేక్ అయ్యింది. ‘మన్వాసనై’లో నాది వ్యాంప్ తరహా పాత్ర. భారతీరాజాగారు అడిగినప్పుడు సంశయించాను. కానీ, పాత్రను పాత్రగా చూడమని ఆయన అనడంతో చేశా. ఆ పాత్రకు మంచి పేరు రావడంతో, ‘మంగమ్మగారి మనవడు’కి కూడా అడిగారు. కోడి రామకృష్ణగారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో నేను చేసినది వ్యాంప్ తరహా పాత్రే అయినా.. జుగుప్సాకరంగా ఉండదు. ఆ పాత్ర తర్వాత ఏ దర్శకులైనా ‘గ్లామరస్’గా కనిపించాలని ఒత్తిడి చేసిన సందర్భాలున్నాయా? నా అదృష్టమో ఏమో కానీ నాకలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. గ్లామరస్ రోల్ అనుకోండి. ‘స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకోవాలి’ అని చెప్పేవారు. అంతకు మించి ఏ ఒత్తిడీ చేయలేదు. అత్త పాత్రలు చేయడం వల్ల మీ మీద ‘గయ్యాళి’ ముద్ర కూడా ఉంది! ఈ మాట నాతో చాలామంది అన్నారు. మామూలుగా ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ఎవరైనా పలకరిస్తుంటారు కదా. అప్పుడు నా మాట తీరు చూసి, ‘ఇంత సాఫ్ట్‌గా మాట్లాడుతున్నారు. కానీ, మిమ్మల్ని గయ్యాళి అనుకున్నాం’ అనేవాళ్లు. బయటి ప్రపంచంలో సినిమా తారల గురించి ఏవేవో అనుకుంటారు. కానీ, వాళ్లతో మాట్లాడినప్పుడే వాళ్లేంటో తెలుస్తుంది. సినిమా పరిశ్రమ ఇక్కడికొచ్చిన తర్వాత కూడా మీరు మద్రాసు నుంచి షిఫ్ట్ అవ్వకపోవడానికి కారణం? అప్పుడు నేను రాలేని పరిస్థితి. ఎందుకంటే, మా అమ్మాయి మద్రాసులో చదువుకుంటోంది. మా ఆయన వ్యాపారం తంజావూరులో. అలా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్‌కు మారలేకపోయాం. మరి.. మీ ఆర్థిక పరిస్థితి సంగతేంటి? వై. విజయ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుందేమో? అని కొంతమంది సందేహిస్తుంటారు. కానీ, నేను ఫైనాన్షియల్‌గా మంచి స్థితిలో ఉన్నాను. అప్పట్లో కొంతమంది తారలు ఆర్థికంగా సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడంవల్ల, ఇబ్బందులపాలైన సంగతి తెలిసిందే. మనం అలా కాకూడదని నేను, నా భర్త అనుకున్నాం. సినిమాలు శాశ్వతం కాదు. బిజినెస్ కూడా అంతే. అందుకే, బాగా సంపాదిస్తున్నప్పుడే భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తే మంచిదనుకున్నాం. కల్యాణ మండపం, ఓ కాంప్లెక్స్ కట్టాం. వాటి ద్వారా మంచి ఆదాయమే వస్తోంది. మీ వారు ఏం వ్యాపారం చేసేవారు? మాకు పాప పుట్టిన తర్వాత నేను సినిమాల్లో బాగా బిజీ అయ్యాను. మా పాపను బయటివాళ్లు పెంచడం మాకిష్టం లేదు. అందుకని, మావారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇండియన్ ఆయిల్లో డీలర్షిప్ తీసుకున్నారు. కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా చేశారు. మీ అల్లుడు సినిమా పరిశ్రమకు చెందినవారేనా? కాదు. రాయ్ ఆంటోని (అల్లుడి పేరు) యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఫీల్డ్‌లో ఉన్నారు. అమ్మాయి, అల్లుడు అక్కడే ఉంటారు. ఈ మధ్య బాబు పుట్టాడు కాబట్టి, ప్రస్తుతం ఇక్కడకి వచ్చింది. వచ్చే నెల అమెరికా వెళ్లిపోతుంది. మేం చెన్నయ్‌లోని మహాలింగపురంలో ఉంటాం. సో.. హ్యాపీ లైఫ్ అన్నమాట? కచ్చితంగా! నా జీవితం మొత్తం ఆల్మోస్ట్ హ్యాపీగానే గడిచింది! జీవితంపట్ల ఎలాంటి నిరాశా నిస్పృహలు, పెద్దగా ఆశలు లేవు. అయితే త్వరలో తీరిక దొరకనుంది కాబట్టి మంచి పాత్రలు వస్తే చేయాలని ఉంది! - డి.జి. భవాని మీ కుటుంబ నేపథ్యం? మాది కడప. మా నాన్నగారు కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో డిస్ట్రిక్ట్ మేనేజర్‌గా చేసేవారు. మాది అప్పర్ మిడిల్ క్లాస్ అనొచ్చు. అమ్మానాన్నలకు మేం పది మంది. ఆరుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు. నేను ఐదోదాన్ని. నా సిస్టర్, బ్రదర్స్ అందరూ చక్కగా సెటిలయ్యారు. వై.రాజా అని నా బ్రదర్ టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఈ రంగంలో ఉన్నది నేను, నా బ్రదరే!