breaking news
Y Guru
-
సెల్కాన్ సీఎండీకి టీవీ5 బిజినెస్ లీడర్స్ అవార్డు
హైదరాబాద్: దేశీ సెల్‌ఫోన్ కంపెనీ ‘సెల్కాన్’ సీఎండీ వై.గురు టీవీ5 బిజినెస్ లీడర్స్ అవార్డును సొంతం చేసుకున్నారు. భారత్‌లో తయారీ విభాగం కింద ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమైన మేకిన్ ఇండియాను ముందుకు తీసుకెళ్లే వ్యాపారవేత్తలను గౌరవించేందుకు ఈ విభాగాన్ని కేటాయించారు. కాగా, ఈ అవార్డు అందుకోవడం పట్ల వై.గురు సంతోషం వ్యక్తం చేశారు. 2009లో చిన్న బ్రాండ్‌గా సెల్కాన్ మొదలై నేడు దేశంలోనే ప్రముఖ బ్రాండ్‌గా అవతరించడం పట్ల సంతోషాన్ని ప్రకటించారు. సెల్కాన్ను విశేషంగా ఆదరించిన కస్టమర్లకు ఈ అవార్డును అంకితం చేస్టున్నట్టు ప్రకటించారు. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకుం టున్న సెల్కాన్ సీఎండీ వై.గురు, పక్కనే ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్, మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
సెల్కాన్ ఆర్అండ్డీ హబ్
♦ గచ్చిబౌలిలో 20 అంతస్తుల్లో ♦ 2018కల్లా హబ్ సిద్ధం చేస్తాం ♦ ‘సాక్షి’తో సెల్కాన్ సీఎండీ వై.గురు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్కాన్... రీసెర్చ్, డెవలప్మెంట్ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొబైల్ ఫోన్ల కాన్సెప్ట్ మొదలు హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ వంటి విభాగాలన్నీ ఒకేచోట కేంద్రీకృతం చేయాలన్నది కంపెనీ ఆలోచన. గచ్చిబౌలిలో ప్రతిపాదిత మొబైల్ ఆర్ అండ్ డీ హబ్‌లో సెల్‌కాన్‌కు ఒక ఎకరం స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేంద్రం నుంచి పలు ప్రోత్సాహకాలను అందుకుని ప్రాజెక్టును ముందుకు తీసుకెళతామని సెల్కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. మొబైల్స్ తయారీ విషయంలో వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఈ హబ్‌ను నిర్మిస్తామని చెప్పారు. కంపెనీలన్నీ ఒకేచోట..: ప్రస్తుతం సెల్‌కాన్‌కు చైనాలోని ఆర్ అండ్ డీ కేంద్రంలో 100 మంది, బెంగళూరు టెక్నోవేషన్ కేంద్రంలో 400 మంది నిపుణులు ఉన్నారు. ఈ రెండు కేంద్రాలను హైదరాబాద్‌కు తరలిస్తారు. సెల్‌కాన్‌తో దాదాపు 20 కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి. వీటన్నిటినీ ఒకే గూటి కిందకు తేవాలన్నది తమ ప్రణాళిక అని గురు వెల్లడించారు. ఆగస్టులో శంకుస్థాపన చేసి, 2018కల్లా 20 అంతస్తుల్లో హబ్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే దేశంలో తొలి కేంద్రం అవుతుందని వివరించారు. హబ్ నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటుకు రూ.100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. కాగా, నెలకు 10 లక్షల మొబైళ్ల తయారీ సామర్థ్యంతో నిర్మిస్తున్న తిరుపతి ప్లాంటును జూన్‌లో ప్రారంభించేందుకు సెల్కాన్ సిద్ధం అవుతోంది. టెక్నోవేషన్ నుంచి..: సెల్కాన్ త్వరలో క్లిక్ అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. బెంగళూరు టెక్నోవేషన్ కేంద్రంలో అభివృద్ధి అయిన తొలి ఉత్పాదన ఇది. 180 డిగ్రీల పనోరమిక్ వ్యూలో చిత్రాలను ఈ ఫోన్ ద్వారా తీయవచ్చు. జిఫ్ ఫైల్ మాదిరిగా 3 సెకన్లపాటు వీక్షించగలిగే లైవ్ ఫొటో, ఎలాంటి హెడ్ సెట్లో అయినా సంగీతం శ్రావ్యంగా వినిపించే కస్టమైజ్డ్ మ్యూజిక్ ప్లేయర్‌ను జోడించారు. బ్యాటరీ 10%కి రాగానే ఇందులోని సూపర్ పవర్ సేవర్ ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్ కాస్తా బేసిక్ ఫోన్‌గా మారిపోతుంది. -
భారత్‌లో సెల్కాన్ ఆర్ అండ్ డీ కేంద్రం
-
ఏ35కే సంచలనం సృష్టిస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటీవల విడుదల చేసిన తమ స్మార్ట్‌ఫోన్ ఏ35కే సంచలనం సృష్టిస్తోందని, ఇప్పటికే లక్షకుపైగా పీసులు అమ్ముడయ్యాయని సెల్కాన్ సీఎండీ వై.గురు వెల్లడించారు. ఆన్‌డ్రాయిడ్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌తో రూపొందించిన ఈ మోడల్లో మరో 10 లక్షల ఫోన్లకు ఆర్డర్లున్నాయని ఆయన చెప్పారు. మార్కెట్లో కిట్‌క్యాట్‌తో 3జీ ఫోన్ల ధర రూ.10 వేల పైమాటేనని, తాము రూ.3 వేలకే అందించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మోడల్‌కు అనూహ్య స్పందన వస్తోందని, అగ్ర దేశాల వెబ్సైట్లు సైతం ఈ మోడల్ గురించి చర్చించడం విశేషమన్నారు. కొన్ని సెల్‌ఫోన్ కంపెనీలు సెల్కాన్ను అనుసరించనున్నాయని తెలిపారు. ఇప్పటికే తాము విక్రయిస్తున్న 9 దేశాలతోపాటు యూరప్, ఆఫ్రికాలో మరో 20 దేశాల్లో ఏ35కే విడుదల చేయనున్నట్టు చెప్పారు. మార్కెట్ తీరుతెన్నులు, భవిష్యత్ మోడళ్ల వివరాలను సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు? టెక్నాలజీతోపాటే కస్టమర్ల అభిరుచులు మారుతున్నాయి. ఫీచర్లపరంగా చూస్తే కిట్‌క్యాట్, 2జీబీ ర్యామ్, గెస్చర్ సెన్సార్, రంగు రంగుల్లో ఎక్స్ట్రా ప్యానెల్స్, క్వాడ్‌కోర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, స్లిమ్, తేలికైన ఫోన్లను కస్టమర్లు కోరుకుంటున్నారు. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా మోడళ్లను రూపొందిస్తున్నాం. పలుచని, తేలికైన స్మార్ట్‌ఫోన్‌తో రికార్డుల్లోకి ఎక్కారు. భవిష్యత్ మోడళ్లు ఏం తేబోతున్నారు? కిట్‌క్యాట్‌తో మిలీనియం సిరీస్‌లో ఇప్పటికి 5 మోడళ్లు తెచ్చాం. మరో రెండు రానున్నాయి. అన్ని మోడళ్లు క్వాడ్కోర్తో రూపొందినవే. రూ.6 వేల లోపే క్వాడ్‌కోర్ మోడల్‌ను తీసుకొచ్చాం. 7.9 మిల్లీమీటర్ల మం దంలో క్యూ455 మోడల్ ప్రవేశపెట్టాం. క్వాడ్కోర్లో ఇంత పలుచని ఫోన్ ప్రపంచంలో ఇదే మొదటిది. అమెరికా కంపెనీ బ్రాడ్‌కామ్ చిప్సెట్ వాడాం. ఫోన్ వేడి కాకుండా పీసీబీ లేఅవుట్ డిజైన్ చేశాం. ఇక 2జీబీ ర్యామ్‌తో క్యూ500 అనే మోడల్ ఈ వారమే మార్కెట్లోకి వస్తోంది. దసరాకల్లా ఆక్టాకోర్ మోడల్‌ను ఆవి ష్కరిస్తాం. 5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి ఫీచర్లుంటాయి. కలర్ ప్యానెల్స్‌తో 3జీ కిట్‌క్యాట్ ఫోన్‌ను ప్రపంచంలో తొలిసారిగా రూ.5 వేలలోపు పరిచయం చేస్తాం. కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తున్నారా? ఫ్యాబ్లెట్స్ విభాగంలోకి ప్రవే శిస్తున్నాం. 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, వన్ గ్లాస్ సొల్యూషన్‌తో 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో రానుంది. డ్యూయల్ కోర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీతో 7 అంగుళాల ట్యాబ్లెట్ పీసీ సెప్టెంబరులో తీసుకొస్తున్నాం. గ్లాస్ ఫినిష్, హెచ్డీ డిస్ప్లే అదనపు ఆకర్షణ. ధర రూ.7 వేల లోపే ఉం టుంది. పవర్ బ్యాకప్, డేటా కార్డ్స్, బ్లూ టూత్ వంటి యాక్సెసరీస్ విభాగాల్లోనూ అడుగు పెట్టనున్నాం. త్వరలో వైఫై సిటీలు రాబోతున్నాయి. వీటికి సంబంధించి మీరేం చేయబోతున్నారు? నవంబరులో 4జీ ఫోన్ల విభాగంలో రెండు మోడళ్లతో అడుగు పెడతాం. అలాగే బేసిక్ ఫోన్లను వైఫై ఫీచర్‌తో ప్రవేశపెట్టబోతున్నాం. ఖరీదైన ఫోన్ మాదిరిగా గ్లాసీ ఫినిష్ ఉంటుంది. ధర రూ.2 వేల లోపే. కెపాసిటివ్ టచ్‌తో రూ.2,500కే వైఫై మోడల్‌ను ఆవిష్కరిస్తాం. మా ప్రస్థానం ప్రారంభమైంది ఫీచర్ ఫోన్ల నుంచే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విభాగాన్ని విస్మరించం. వాట్సాప్‌తో 7 బేసిక్ మోడళ్లను తెచ్చాం. ఎక్స్ట్రా ప్యానెల్స్‌తో ఒక మోడల్‌ను రూ.1,500లకే విక్రయిస్తున్నాం. అందుబాటు ధరలో ప్రభుత్వానికి వైఫై ఫోన్లు విక్రయించేందుకు మేం సిద్ధం. ఆన్లైన్ మార్కెటింగ్ వ్యూహం ఏమిటి? మార్కెట్‌కు అనుగుణంగా కొన్ని మోడళ్లను స్నాప్‌డీల్ వంటి కంపెనీల భాగస్వామ్యంతో ఆన్లైన్లో విక్రయిస్తున్నాం. దేశవ్యాప్తంగా 800, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 165 సర్వీసింగ్ కేంద్రాలతో కస్టమర్లకు చేరువయ్యాం. ఫోన్ కొనుగోలు చేసిన వారంలోపు సమస్య వస్తే కొత్తది ఇస్తున్నాం. ఏడాది వరకు ఉచిత సర్వీస్ అందిస్తున్నాం. ఓవర్ ద ఎయిర్(ఓటా) అనే యాప్‌తో పాత వర్షన్ నుంచి కిట్క్యాట్కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు వీలు కల్పిస్తున్నాం. స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా స్మార్ట్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. విక్రయాల్లో ఏ స్థానంలో ఉన్నారు? గత మూడేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఫీచర్ ఫోన్ల అమ్మకాల్లో అగ్ర స్థానంలో ఉన్నాం. నెలకు 3 లక్షల ఫోన్లను విక్రయిస్తున్నాం. ఈ ఏడాది స్మార్ట్ఫోన్ల విభాగంలోనూ తొలి స్థానం లక్ష్యంగా చేసుకున్నాం.