క్రీడోత్సాహం (రౌండప్ 2013)
ప్రపంచ క్రీడా యవనికపై 2013 సంవత్సరం మనజిల్లాకు అంతులేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. తిరుగులేని పోరాట పఠిమతో మనవాళ్లెందరో అంతర్జాతీయంగా మెరిసి పతకాల పంట పండించారు. చెస్, స్విమ్మింగ్, ఆర్చరీలో అంతర్జాతీయ విజేతలుగా నిలవడమే కాదు.. స్కేటింగ్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, వెటరన్స్ అథ్లెటిక్స్‌లో విజయ ఢంకా మోగించారు. జాతీయస్థాయి పైకా పోటీలకు ఎంతోమంది వర్థమాన క్రీడాకారులు అర్హత సాధించి క్రీడా రంగంలో వరుసగా ఆరోసారి రాష్ర్టంలో మనజిల్లాను ప్రథమస్థానంలో నిలిపారు. మొత్తానికి 2013 క్రీడాకారులకు బాగా కలిసొచ్చిన కాలంగా చెప్పొచ్చు. అయితే, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అభిమానులను నిరాశకు గురిచేశారు.
చదరంగ విజేతలు
చెస్ క్వీన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోనేరు హంపి ఈ ఏడాది జూన్, సెప్టెంబరులో ఆర్మేనియా, ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన వరల్డ్ చెస్ గ్రాండ్ప్రిక్స్ స్టేజ్-1, 2లో విజేతగా నిలిచింది. అక్టోబరు 11 నుంచి 18 వరకు గ్రీస్‌లో జరిగిన యూరోపియన్ చెస్ క్లబ్ టోర్నీలో టీమ్ ఈవెంట్‌తో పాటు వ్యక్తిగత ఈవెంట్లో రెండింటిలోనూ స్వర్ణపతకాలు సాధించింది. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు చైనాలో జరిగిన చైనీస్ లీగ్‌లో కూడా విజేతగా నిలిచింది.
దక్షిణాఫ్రికాలో జూలైలో జరిగిన కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో గ్రాండ్ మాస్టర్ ఎంఆర్ లలిత్‌బాబు కాంస్య పతకం సాధించాడు.
జూన్‌లో ఇరాన్లో జరిగిన ఏషియన్ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఎన్.ప్రియాంక బ్లిట్జ్ విభాగంలో స్వర్ణ, క్లాసికల్లో రజత పతకం సాధించగా, పొట్లూరి సుప్రీత రాపిడ్ విభాగంలో రజత పతకం కైవసం చేసుకుంది.
విజయంపైనే గురి
ఉజి(చైనా)లో అక్టోబరు 13 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత కాంపౌండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జిల్లా ఆర్చర్లు చిట్టిబొమ్మ జిజ్ఞాస్ మూడు కాంస్య, వెన్నంజ్యోతి సురేఖ రెండు కాంస్య పతకాలు సాధించారు. నూజివీడులో శిక్షణ పొందినవారు డిసెంబరు మొదటి వారంలో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పైకా గ్రామీణ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌షిప్ సాధించడం విశేషం. వీరేకాకుండా జాతీయ, అంతర్జాతీయస్థాయి ఆర్చరీలో ఓల్గా అకాడమీ ఆర్చర్ల పూర్వాషా సుధీర్షిండే, వై.అనూషరెడ్డి, పి.గీతికాలక్ష్మి, జి.కావ్య, కె.జ్యోత్స్న, డాక్టర్ మండవరిషిత, చిరంజీవి ఫణిభూషణ్‌రావు. నరేన్కుమార్, అనిరుధ్ దుర్గేష్, ఎ.మోహన్‌కృష్ణ, లక్ష్మన్ హవీష్, ఇ.సాహిత్, ఎం.సాయిచరిత్, కె.పిచ్చయ్య, కె.మహేష్, బొమ్మదేవర ధీరజ్, రోహిత్మణివర్మ, ఎ.వెంకటాద్రి, కె.నాగబాబు రాణించారు.
ఈత.. మనోళ్ల ఘనత
ఆగస్టు మొదటి వారంలో ఐర్లాండ్‌లో జరిగిన వరల్డ్ పోలీసు మీట్లో విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎం.తులసీచైతన్య ఏకంగా మూడు స్వర్ణ, మూడు రజత పతకాలు సాధించి శభాష్ అనిపించాడు. ఈ ఘనతతో రాష్ట్ర పోలీసు శాఖ ఆయనకు ఏడు ఇంక్రిమెంట్లు ఇవ్వడమే కాకుండా హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించింది. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో విజయవాడలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించలేకపోయినా... జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గడిచిన రెండు నెలల్లో రాష్ట్రస్థాయి పైకా (ఉమెన్/గ్రామీణ) పోటీలు నిర్వహించారు. నవంబరులో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో పైకా ఉమెన్ కబడ్డీ, కేతనకొండ సీబీఆర్ స్పోర్ట్స్‌లో పైకా గ్రామీణ వెయిట్‌లిఫ్టింగ్, ఇందిరగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆర్చరీ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి(జూనియర్/సబ్‌జూనియర్)వింటర్ స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు.
కబడ్డీలో క్రీడామణులు
కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నందిగామ కేవీఆర్ కళాశాలలో సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళా కబడ్డీ టోర్నీ విజయంవంతంగా నిర్విహ ంచారు. కృష్ణా యూనివర్సిటీ మహిళా కబడ్డీ జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. జట్టులో అవనిగడ్డలోని కమ్మనమోలు గ్రామానికి చెందిన ఎన్.తిరుపతమ్మ (ఎస్ఆర్ఆర్ కళాశాల), నాగాయలంక (తలగడదీవి)కిచెందిన మరియ మౌనిక (బుద్దవరం వీకేఆర్ కళాశాల) ఆంధ్ర జట్టులో కీలక క్రీడాకారిణులుగా ఎదిగారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సౌత్‌జోన్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా ఆంధ్ర జట్టు నిలిచింది. ఇందులో కూడా వీరిదే కీలకపాత్ర.
2013 విజేతలు వీరే ..
డిసెంబరు 21 నుంచి 29వ తేదీ వరకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సౌత్‌జోన్, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళా బాస్కెట్‌బాల్ టోర్నీ జరిగింది. నవంబరు 30 నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి (పంచాయితీ యువ క్రీడా ఔర్ఖేల్ అభియాన్)పైకా మహిళా పోటీల్లో జిల్లా అథ్లెట్లు, టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు దుమ్మురేపారు. ఈ పోటీల నుంచే జనవరిలో భోపాల్‌లో జరగబోయే జాతీయస్థాయి మహిళా టోర్నీలో జిల్లా నుంచి ఆరుగురు అథ్లెట్లు, టేబుల్ టెన్నిస్‌లో ముగ్గురు రాష్ట్ర జట్లకు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్‌లో కె.అనితాదేవి ఉత్తమ త్రోయర్‌తో పాటు బెస్ట్ అథ్లెట్‌గా నిలిచింది. అలాగే, జె.వరలక్ష్మి (ఉయ్యూరు), ఎస్.రాధిక, జె.శుభశ్రీ, బి.భవాని యాదవ్ , జి.కృష్ణకుమారి అథ్లెట్లు జాతీయ పైకా ఉమెన్ మీట్‌కు ఎంపికయ్యారు. టేబుల్ టెన్నిస్‌లో ఎస్కే ముంతాజ్, సీహెచ్ ప్రణీత, ఎస్కే సైరాభాను, కాజోల్, నూర్‌బాషా శైలూ విశేషంగా రాణించారు. స్కేటింగ్‌లో రియా సాబూ, సుభ్రాతాతియా, దాసరి అలేఖ్య, వెంకట్, కె.చేతన్‌రెడ్డి జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. వెయిట్ లిఫ్టింగ్‌లో గుడివాడలోని యలమర్రుకు చెందిన శిరోమణి జాతీయస్థాయిలో రెండు స్వర్ణ పతకాలు సాధించింది. అండర్-19 ఉమెన్ క్రికెట్లో బీసీసీఐ సౌత్‌జోన్ టోర్నీ ఆంధ్ర జట్టు విజేతగా నిలిచింది. ఇందులో ఆర్.కల్పన, ఎస్.మేఘన, జి.స్నేహ జట్టు విజయానికి కీలకపాత్ర పోషించారు.